Idream media
Idream media
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి వచ్చేలా చివరికి కార్మికులు వెనక్కి తగ్గారు. తమ ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ను ఉపసంహరించుకుంటున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ విలీనం తో సహా 26 డిమాండ్ల పై 42 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం కార్మికులు సమ్మె ను పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు 23 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గుండెపోటు తో మరణించగా మరికొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
దాదాపు 50 వేలు మంది కార్మికులు ఆందోళన చేస్తున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోకపోవడం తో తెలంగాణ లో జనజీవనం స్తంభించింది. కోర్టు జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. తమను చర్చలకు పిలవాలని కార్మిక నాయకులు ఎన్ని సార్లు ప్రాధేయపడినా కేసీఆర్ ఉలుకూ పలుకు లేకుండా ఉన్నారు. ఆర్టీసీ ని ప్రయివేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్మికులతో పాటు న్యాయవ్యవస్థ, తెలంగాణ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వచ్చిన కేసీఆర్ స్పందించకపోవడం తో కార్మిక కుటుంబాల శ్రేయస్సు దృష్ఠ్య ఆర్టీసీ జేఏసీ ఒక అడుగు వెనక్కి వేసింది. విలీనం డిమాండ్ వదిలేస్తున్నామని, మిగతా డిమాండ్ల పై చర్చలకు పిలవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏమి చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. విలీనం డిమాండ్ లేకపోవడం తో చర్చలకు పిలుస్తాడా..? లేక ఆర్టీసీ ని ప్రవేట్ పరం చేస్తారా..? తేలాల్సి ఉంది.