iDreamPost
android-app
ios-app

వార్నింగ్ కు వెయ్యి,దాడికి పది వేలు.. మర్ధర్ యాభై వేలు.. రౌడీ గ్యాంగ్ రేట్ కార్డు

వార్నింగ్ కు వెయ్యి,దాడికి పది వేలు.. మర్ధర్ యాభై వేలు.. రౌడీ గ్యాంగ్ రేట్ కార్డు

ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తొట్టిగ్యాంగ్ చిత్రంలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. రౌడీల మధ్య కాంపిటీషన్ పెరిగిపోవడంతో రౌడీలైన చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ హత్యలు కిడ్నాపులు చేయడానికి తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తారు.. రెండు మర్డర్లకు ఒక ఆక్సిడెంట్ ఫ్రీ, రెండు రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ.., ఒక మెడ నరికితే ఒక తొడ ఫ్రీ.., ఒక కాలు నరికితే ఒక వేలు ఫ్రీ..,ఒక కన్ను పీకితే ఒక పన్ను ఫ్రీ అంటూ బోర్డ్ పెట్టి మరీ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే అని టైమ్ లిమిట్ కూడా పెడతారు. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ రౌడీ గ్యాంగ్ ప్రకటనలు ఇచ్చి చిక్కుల్లో పడింది.

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఒక రౌడీ గ్యాంగ్ తమ వద్దకు వివిధ కారణాలతో వచ్చే కస్టమర్ల కోసం ఒక్కో క్రైమ్ కు ఎంత ఛార్జి వసూలు చేస్తారో పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటనలు ఇవ్వడం కలకలం సృష్టిస్తుంది. ఆ గ్యాంగ్ రిలీజ్ చేసిన పోస్టర్లో బెదిరించడానికి 1000 రూపాయలు, ఎవరినైనా కొట్టడానికి 5,000 రూపాయలు, తీవ్రంగా గాయపర్చడానికి 10,000 రూపాయలు, హత్య చేయాలి అంటే 55,000 రూపాయలు తమ గ్యాంగ్ కు చెల్లించాలని ఉంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టి ఈ ప్రకటనపై పడింది. దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గ్యాంగ్ విడుదల చేసిన పోస్టర్ పై ఒక యువకుడు చేతిలో తుపాకీ పట్టుకుని ఉండగా మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు.ఈ ప్రకటన పోలీసు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దాంతో ఈ యువకులంతా ఎవరు ప్రకటన ఎక్కడ నుండి వచ్చిందన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రకటన ఇచ్చిన యువకులు చరతవాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చౌకడ గ్రామానికి చెందిన వారని తేలింది. వీరిలో ఓ యువకుడు పీఆర్‌డీ జవాన్‌ కుమారుడని పోలీసులు గుర్తించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కులదీప్ కుమార్ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఏది ఏమైనా యువకుల్లో పెరిగిన నేర ప్రవృత్తికి నిదర్శనంగా ఈ ముజఫర్ నగర్ గ్యాంగ్ ప్రకటన నిలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ధైర్యంగా ప్రకటనలు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు