iDreamPost
iDreamPost
నిజంగానే ఆర్ఆర్ఆర్ కు ముహూర్తం పెట్టిన వారెవరో వెతికి మరీ పట్టుకుని నిలదీయాలి. బహుశా ఇన్ని వాయిదాలు ఇబ్బందులు పడిన సినిమా గత కొన్నేళ్లలో ఇదే అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో ఎంఎస్ ఆర్ట్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంజి, అమ్మోరు లాంటి చిత్రాలు ఐదారేళ్ళ తీయడం గొప్పగా చెప్పుకున్నారు కానీ బాహుబలి నుంచి రాజమౌళికి ఇది సాధారణ వ్యవహారమైపోయింది. విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13కి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే బిజినెస్ వ్యవహారాలు జరుగుతున్నాయి. తమిళ కన్నడ మలయాళం హక్కులను ఈపాటికే అమ్మేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ డీల్స్ దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టే.
ఇక్కడితో అంతా అయిపోలేదు. కరోనా నార్త్ ని వణికిస్తోంది. మహారాష్ట్ర లాంటి చోట్ల పరిస్థితి తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చెప్పేసిన రిలీజ్ డేట్లు మళ్ళీ వాయిదా వేస్తున్నారు. అక్కడి థియేటర్ల రన్ మరీ దయనీయంగా ఉంది. జనం భయంతో రాకపోవడం ఒకవైపు, సరైన సినిమా లేక పబ్లిక్ ని ఆకర్షించలేక ఇబ్బందులు పడుతున్న వైనం మరోవైపు అంతా అగమ్యగోచరంగా ఉంది. సూర్యవంశీ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ తప్పదనే టాక్ ఇప్పటికే ఉంది. ఇదంతా పూర్తిగా కుదుటపడడానికి ఎంతలేదన్నా ఆరు నెలలు పడుతుందని అక్కడి పరిశీలకులు అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ కు పెట్టిన పెట్టుబడి లాభాలతో సహా రావాలంటే అంతా నార్మల్ గా ఉండాలి. వంద శాతం సీటింగ్ కెపాసిటీతో అదనపు ఆటలు, టికెట్ ధరల హైక్, బెనిఫిట్ షోలు అన్నీ ఉండాలి. కానీ ఇప్పట్లో ఇదంత సులభంగా జరిగే వ్యవహారం కాదు. సుమారుగా 500 కోట్ల రూపాయల టార్గెట్ తో బరిలో దిగుతున్న ఆర్ఆర్ఆర్ కు హిందీ మార్కెట్ చాలా కీలకం. అందుకే ఒకవేళ అక్టోబర్ లోనే రిలీజ్ చేయాలంటే డీల్స్ లో మార్పులు తప్పకపోవచ్చు. ఇదంతా ఎందుకొచ్చిన గోల అనుకుంటే 2022 సంక్రాంతికి వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. ఇంకా ఆరు నెలలు టైం ఉంది కాబట్టి ఆలోగా అంత సద్దుమణిగితే అంత కన్నా గుడ్ న్యూస్ మూవీస్ లవర్స్ కి ఏముంటుంది.