iDreamPost
iDreamPost
రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తులు ఇక ఊపిరి పేల్చుకోవచ్చు. న్యాయమూర్తులే కాదు న్యాయవాదులు, న్యాయస్థానాల ఉద్యోగులు, మొత్తంగా న్యాయవ్యవస్థ ఇక గుండెలపై చేయివేసుకుని తమపని తాము చేసుకుంటూ పోవచ్చు. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో న్యాయమూర్తులు ఇక ధైర్యంగా పనిచేసుకోవచ్చు.
ఆంధ్ర జ్యోతి దినపత్రిక యజమాని రాధాకృష్ణ తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తులకు న్యాయశాస్త్రంపై పూర్తి అవగాహన ఉన్నవారిగా,మానవ హక్కులు, మానవత్వం వంటి విషయాలతో పాటు ప్రజాస్వామిక సూత్రాలకు ప్రాధాన్యమిస్తారని సర్టిఫికెట్ ఇచ్చేశారు. రాధాకృష్ణ ఇచ్చిన ప్రశంసాపత్రంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు, న్యాయవ్యవస్థకు గౌరవం పెరిగింది. పైగా ప్రజల్లో, ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో న్యాయస్థానం పట్ల విశ్వాసం పెరుగుతుంది.చదవటానికి కొత్తగా ఉన్నా ఆంధ్రజ్యోతి ఈ విషయమే రాసింది..
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి “న్యాయశాస్త్రంపై పూర్తి అవగాహన ఉంది” అని చెప్పడం రాధాకృష్ణకు మాత్రమే సాధ్యం. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేందుకు రాధాకృష్ణ మినహా వేరెవ్వరూ సాహసం చేయరు. జర్నలిజంలో పెద్దగా పాఠాలు నేర్చుకోకపోయినా ఈ రంగంలోకి వచ్చి ఉద్యోగం చేసిన పత్రికకే యజమాని అయినట్టు న్యాయశాస్త్రంపై అవగాహన లేకుండానే న్యాయమూర్తులు అవుతున్నారని రాధాకృష్ణ భావించడంలో తప్పులేదు. అందరూ తనలాగే ఉంటారనుకోవడం మానవ సహజం.
జర్నలిజం వృత్తిలో ఉన్నప్పటికీ రాజకీయంగా టిడిపిని భుజాన మోస్తున్న రాధాకృష్ణ ఇంచుమించు తన రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడి ప్రభుత్వంపైనా, ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టే ఏ అవకాశాన్నీ చేజార్చుకోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడి కంటే రాధాకృష్ణే ఎక్కువ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టిడిపి భారీ ఓటమిని చంద్రబాబు జీర్ణం చేసుకోగలుగుతారేమో కానీ రాధాకృష్ణ జీర్ణం చేసుకోలేక పోతున్నారు. అందుకే టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం ఎలా ఉందో విశ్లేషకులు చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రజలు చూస్తూనే ఉన్నారు. శాసనసభలో బలం లేని ప్రతిపక్షం కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని కట్టడిచేయడం, అభద్రతా భావానికి గురిచేయడం తద్వారా ప్రజల్లో ఆయనపాలనపై అసంతృప్తి కలిగించడం లక్ష్యంగా చేసుకున్న టీడీపీ, దానికి అనుబంధంగా కార్యసాధకుడిగా రంగంలోకి దిగిన రాధాకృష్ణ తన “కొత్త పలుకు” వ్యాసం ద్వారా రాష్ట్రంలో న్యాయవ్యవస్థను కాస్త మంచి చేసుకునే ప్రయత్నం చేశారు.
ఈ పద్ధతినే ఇంగ్లీషులో “Keeping in good humour” అంటారు. కాస్త మెచ్చుకునే ప్రయత్నం చేస్తే మన పట్ల సానుభూతితో ఉంటారు అనేది ఒక వ్యూహం. ఈ దేశంలో బ్రిటిషు వాళ్ళు కూడా ఆచరించిన పద్దతి. ఒక రాజును మెచ్చుకుని రెండో రాజుకు అతని మద్దతు లేకుండా చేయడం ఈ వ్యూహం అంతరార్ధం. అయితే అపరమేధావి అయిన రాధాకృష్ణకు ప్రధాన న్యాయమూర్తిని ఎలా మెచ్చుకోవాలో అర్ధం కాక “న్యాయశాస్త్రంపై పూర్తి అవగాహన ఉంది” అని కలం జారాడు.