iDreamPost
android-app
ios-app

ఉరకలెత్తుతున్న గోదావరి

  • Published Aug 13, 2020 | 4:32 PM Updated Updated Aug 13, 2020 | 4:32 PM
ఉరకలెత్తుతున్న గోదావరి

గోదావరికి ప్రధాన ఉపనదులైన శబరి, ఇంద్రావతి నదులు పొంగుతున్న నేపథ్యంలో గోదావరి కూడా ఉరకలెత్తుతోంది. దీనికి తోడు ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యంలో గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5,78,724 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నట్లు ఇరిగేషన్‌ అధికారుల గురువారం సాయంత్రం నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే బ్యారేజీ పరిధిలోని మూడు పంట కాలువల ద్వారా 9,650 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నామని వివరించారు. కాళేశ్వరంలో 7.9 మీటర్లు, పేరూరులో 9.6, దుమ్ముగూడెం 10.33 మీటర్ల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 35.60 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. గురువారం ఉదయంతో పోలిస్తే ఇక్కడ దాదాపు అడుగుకు పైగా నీటిమట్టం పెరిగింది. ఇది మరో రెండు అడుగులు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

కూనవరంలో 14.56 మీటర్లు, కుంటలో 10.7, కోయిడలో 19.13, కాఫర్‌డ్యామ్‌ వద్ద 25.9 మీటర్లు, పోలవరం సీడబ్లు్యసీ వద్ద 11.4 మీటర్లు, రాజమహేంద్రవరం పాత బ్యారేజీ వద్ద 14.94 మీటర్లు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. గోదావరి పరీవాహక పరిధిలోని ఎగువ ప్రాంతాల్లో ఉన్న వాగులు, వంకలు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. దీంతో దిగువకు వరద ఉధృతి మరింతగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి విడుదల చేయాల్సి రావొచ్చని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.