iDreamPost
android-app
ios-app

మళ్ళీ పెరుగుతున్న గోదావరి

  • Published Aug 20, 2020 | 1:29 PM Updated Updated Aug 20, 2020 | 1:29 PM
మళ్ళీ పెరుగుతున్న గోదావరి

శాంతించినట్లే కన్పించిన గోదావరమ్మ మళ్ళీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని శబరి, ఇంద్రావతి ఉపనదుల నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మరోసారి ఉగ్రరూపం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం, భద్రాచలంలలో రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. ధవళేశ్వరాన్ని నీటి మట్టం నిలకడగానే ఉన్నప్పటికీ, భద్రాచలం వద్ద నీటి మట్టంలో పెరుగుదల నమోదవుతోందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉన్నప్పటికీ నీటి ప్రవాహం అంచనాల దృష్ట్యా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి కూడా నీటిమట్టం చేరుకునేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పెరిగిన నీటి మట్టం 36 గంటల తరువాత ధవళేశ్వరం వద్దకు చేరుకుంటుంది.

గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి ధవళేశ్వరం వద్ద 14.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. 14,00,577 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక్కడ నీటిమట్టం ప్రస్తుతం తగ్గుతున్నట్లుగానే కన్పిస్తున్నప్పటికీ ఎగువ నుంచి రానున్న కొన్ని గంటల్లో భారీగా వచ్చిపడే వరదతో నీటిమట్టాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయానికి భద్రాచలం వద్ద 51.30 అడుగుల నీటి మట్టం నమోదైంది.

ఇదిలా ఉండగా డెల్టా కాలువలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి 6,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పుడెల్టాకు 3వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 1800 క్యూసెక్కుల నీరు చొప్పున పారుతోంది. నిజానికి బుధవారం మధ్యాహ్నం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు. కానీ మళ్ళీ వరద గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.30 అడుగులు, కూనవరం వద్ద 20.46 మీటర్ల నీటిమట్టం వద్ద ఉంది. అలాగే కుంట వద్ద శబరి నదీ 14.97 మీటర్లు, తాళ్ళగూడెం వద్ద 14.80 మీటర్లు నీటిమట్టం నమోదైంది.