iDreamPost
iDreamPost
2013లో ఉత్తరాఖాండ్‌లోని మెరుపు వరదలు… 2018 కేరళలో భయంకరమైన వరదలు చూశాం. కళ్లముందే ఇళ్లకు ఇళ్లు.. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. పెద్దపెద్ద భవనాలు నేలకూలాయి. 2015లో చెన్నై… 2019లో ముంబైలో భారీ వర్షాలు సృష్టించిన జల విలయం అంతాఇంతా కాదు. తాజాగా వాయుగుండం ప్రభావంతో మరోసారి చెన్నైతోపాటు మన రాష్ట్రాంలో చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూస్తున్నాము. గత ఏడాది భారీ వర్షాల వల్ల హైదరాబాద్ మహానగరంలో పదుల సంఖ్యలో కాలనీలు.. వందలకొద్దీ ఇళ్లు నెలల తరబడి ముంపులో ఉన్న విషయం తెలిసిందే. భారీ వరదల సమయంలో ఇళ్లు ముంపుబారిన పడడమే కాదు… నదీ ప్రవాహంలో పేకమేడల్లో కొట్టుకు పోతున్నాయి. ఈ విపత్తులకు ప్రకృతి ప్రకోపం కారణమే అయినా జరుగుతున్న నష్టాలకు ప్రధాన కారణం ఆక్రమణలు.
చెరువులు.. కాలువలు.. నదులు… వాటి పరిరక్షణకు ఉన్న గుట్లు.. పరివాహాక ప్రాంతాలు ఇలా సర్వం ఆక్రమణల బారిన పడుతున్నాయి. చెరువులు, కాలువల్లోనే కాదు… చివరకు నదీగర్భాలలోకి వెళ్లి మరీ ఆక్రమణ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు నిబంధనలు, చట్టాలు అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారులు కాసుల వేటలో చేష్టలుడిగి చూస్తున్నారు. భారీ విపత్తుల వచ్చిన సమయంలో ప్రభుత్వం వీరికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయే తప్ప అక్రమ కట్టడాలను అడ్డుకునే పటిష్టమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
బ్రిటీష్ ప్రభుత్వం 1884న రివర్ కన్జెర్వెన్సీ యాక్టును అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం నదీ ప్రవాహాలకు అడ్డుగా ఎటువంటి శాశ్వత కట్టడాలు కట్టకూడదు. తాత్కాలికంగా చేపట్టే నిర్మాణాలైనా సంబంధిత ఇరిగేషన్ హెడ్‌వర్క్సు అధికారుల అనుమతి ఉండాలి. అలాగే వరదల సమయంలో కాపాడేందుకు నిర్మించిన ఏటిగట్లను ఆనుకుని గదీగర్భం వైపు వంద మీటర్ల పరిధిలో ఎటువంటి తవ్వకాలు చేయకూడదు. నది వంపు తిరిగే ప్రాంతాల్లో 150 మీటర్ల వరకు తవ్వకాలు చేయకూడదు. ఇటువంటి నిబంధనలు ఉన్నాయని సామాన్య జనానికే కాదు… ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా తేలియదంటే అతిశయోక్తి కాదు. తెలిసినా ఇప్పుడు పట్టించుకునేవారు లేరు. నదుల నుంచి ఇసుక సేకరిస్తుంటారు. పెద్దపెద్ద చెరువుల్లో పూడిక తొలగించేటప్పుడు మట్టి తీస్తారు. కాని ఇప్పుడు ఇసుక, మట్టినే కాదు.. వాటి గట్లను కూడా అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. గట్లను ఆనుకునే నిర్మాణాలు చేపడుతున్నారు. నదులు, చెరువులు నిండే సమయంలో వరదనీరు దిగే ప్రాంతాలను కూడా కబ్జాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ దిగువున నీరు పారే ప్రాంతాల్లో కాలనీలే వెలిశాయి. ముంబై, చెన్నై, కోల్‌కత్తా వంటి నగరాల్లో సైతం ఇదే పరిస్థితి.
Also Read : Uppada- ఉప్పాడ… గుండె కోత
రియల్ ఎస్టేట్ భూమ్:
రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చిన తరువాత నగరాలు, పట్టణాల్లో చెట్టు, పుట్ట.. చెరువు.. కాలువ అనే తేడా లేదు. ఎక్కడపడితే అక్కడ కబ్జాలే. అక్రమ నిర్మాణాలే. కాలనీలకు, కాలనీలు అనధికారికంగా ఏర్పడుతున్నాయి. పెద్దపెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. ఆపార్ట్‌మెంట్ల నిర్మాణలు కూడా జరిగిపోతున్నాయి. చివరకు మురుగునీరు దిగే డ్రైన్ల మీద కూడా నిర్మాణాలు సాగుతున్నాయి. అందుకే కొద్దిపాటి వర్షానికి నగరాలు మునిగిపోతున్నాయి.
గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులకు వరద వచ్చినా కనీసం బాధితులను తరలించేందుకు సమయం, వరద ముంపుపై ఒక అవగాహన ఉంటుంది. కాని పెద్ద పెద్ద చెరువులు, మరీ ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండే చెరువులు అకస్మాత్తుగా వర్షాలు కురిసినప్పుడు గంటల వ్యవధిలో గేట్లు తెరి వరద నీరు వదలాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో గట్లు తెగిపడి ముంపునీరు వచ్చి పడుతుంది. ఈ సమయంలో వాటి ప్రవాహ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లు, కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకోవడం పరిపాటి. కొన్ని సందర్భాల్లో ఇళ్లుకు ఇళ్లే కొట్టుకుపోతున్నాయి.
పర్యాటకం పేరుతో అనధికార కట్టడాలు:
సామాన్యులు, రియల్టర్లే కాదు.. ప్రభుత్వాలు సైతం పర్యాటకం పేరుతో నదీగర్భాలలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తుండడం విడ్దూరం. గోదావరిలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నర్సాపురం, అంతర్వేది, దిండి వంటి ప్రాంతాల్లో పర్యాటకం పేరుతో గోదావరిలో కట్టడాలున్నాయి. ఇక కృష్ణాను ఆనుకుని ఏటిగట్ల పొడవునా, నదీగర్భంలో నిర్మాణాల గురించి తెలియనిది కాదు. చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న ఇళ్లు కూడా కృష్ణా గర్భంలోనే. ఇలా పెద్దవారు, పాలకులే అక్రమ కట్టడాలు కట్టడం చూసి సామాన్యులు కూడా ఇదే బాట పడుతున్నారు. కేరళలో పర్యాటకం పేరుతో నదీగర్భాలలో నిర్మించిన రిసార్టులు, హోటళ్లు వరదల సమయంలో ఎంత ముంపునకు గురైంది చూశాం. ఇప్పటికైనా వీటిని అడ్డుకోకుంటే నష్టాల తీవ్రత పెరగడమే కాదు.. వారికి పరిహారం ఇవ్వాల్సి రావడం కూడా ప్రభుత్వాలకు భారమవుతుంది.
Also Read : Diviseema Uppena – దివిసీమ ఉప్పెనకు 45 ఏళ్లు.. ఇప్పటికీ మానని గాయం