iDreamPost
android-app
ios-app

టీడీపీలో ‘కాక’నాడ.. సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో వర్గ పోరు

  • Published Jan 04, 2022 | 2:02 PM Updated Updated Jan 04, 2022 | 2:02 PM
టీడీపీలో ‘కాక’నాడ.. సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో వర్గ పోరు

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఉంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనానికి కాకినాడ రూరల్‌, సిటీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఓడిపోయినా వర్గపోరును మాత్రం వీడడం లేదు. ఈ రెండుచోట్లా ఓటమే కాక వర్గపోరు కారణంగా రెండు నెలల క్రితం కాకినాడ కార్పొరేషన్‌పై కూడా ఆ పార్టీ పట్టు కోల్పోయింది. మేయర్‌పై సొంత పార్టీ సభ్యులే ఆవిశ్వాసాన్ని ప్రతిపాదించి ఓడించడం అందరికీ తెలిసిందే. అయినా పార్టీలో పెత్తనం కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. కీలక నేతల మధ్య వర్గ పోరు తమ్ముళ్లకు తలపోటుగా మారింది.

రూరల్‌లో రాజప్ప రాజకీయం

రూరల్‌ సీటుపై కన్నేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అక్కడ పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) ప్రాబల్యం తగ్గించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి ఆమెకు, ఆమె భర్త, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్తిబాబుకు చెక్‌ పెట్టాలని రాజప్ప వర్గం వ్యూహం. తద్వారా తనకు అనుకూలుడైన నాయకుడిని నియమించుకోవాలని రాజప్ప భావిస్తున్నారు. ఇదే సమయంలో పిల్లి దంపతులను కొనసాగించాలంటూ అధిష్టానం వద్ద మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పట్టుబడుతున్నారని వినికిడి. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా పిల్లి వర్గానికి వెన్నుదన్నుగా ఉండేవారు. భాస్కర రామారావు మరణానంతరం సత్తిబాబు వర్గానికి పార్టీలో యనమల ఒక్కరే పెద్ద దిక్కుగా మిగిలారు. దీంతో యనమల సాయంతో రాజప్ప రాజకీయాన్ని అడ్డుకోవాలని సత్తిబాబు యత్నిస్తున్నారు.

సత్తిబాబుపై ఫిర్యాదులు

సత్తిబాబును వ్యతిరేకించే నాయకులందరూ ఇప్పటికే రెండుసార్లు అధిష్టానానికి ఆయనపై ఫిర్యాదులు చేశారు. అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో వారం రోజుల క్రితం సత్తిబాబు దంపతులను వ్యతిరేకించే రూరల్‌ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మళ్లీ ఫిర్యాదు చేశారు. సత్తిబాబు పార్టీ కోసం పని చేయడం లేదని వారు ఆధారాలతో నివేదించారు. కాకినాడ కార్పొరేషన్‌లో పలు డివిజన్లకు ఉప ఎన్నికలు జరిగాయి. రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని 3వ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ వేసినప్పటికీ తరువాత ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో సత్తిబాబు అంగీకారంతోనే నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు చంద్రబాబుకు నాయకులు ఫిర్యాదు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ఇటీవలి కాకినాడ కార్పొరేషన్‌ ఉప ఎన్నికల వరకూ పార్టీ అభ్యర్థులు బరిలో లేకుండా చేసి, టీడీపీకి సత్తిబాబు ద్రోహం చేశారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సత్తిబాబు దంపతులను ఇంకా ఇన్‌‌ఛార్జిగా ఎలా కొనసాగిస్తారని చంద్రబాబును అడిగారని సమాచారం. వారిని ఇన్‌‌ఛార్జిగా తప్పించకుంటే రూరల్‌లో పార్టీకి అడ్రస్సే లేకుండా పోతుందనే వాదనను బాబు ముందుకు తీసుకువెళ్లారు. పెంకే శ్రీనివాసబాబా, పేరాబత్తుల రాజశేఖర్, మామిడాల వెంకటేష్ తదితర నేతలను చినరాజప్ప వర్గం ప్రోత్సహిస్తోందని పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను తప్పించి, సొంత సామాజికవర్గానికి ఇన్‌‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించే వ్యూహంలో భాగంగానే రాజప‍్ప ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.

Also Read : అమ‌రావ‌తి రైతుల‌కు ఏపీ స‌ర్కారు గుడ్ న్యూస్‌..!

మార్పు తప్పదా?

గతంలో రాజప్ప వర్గం తనపై ఫిర్యాదు చేయడంతో అలక వహించిన సత్తిబాబు తాను ఇన్‌ఛార్జిగా తప్పుకొని, కార్యకర్తగా కొనసాగుతానని పత్రికా ముఖంగా ప్రకటించారు. కానీ అంతలోనే మాట మార్చి అధిష్టానం సూచన మేరకు కొంత కాలం కొనసాగుతానని చెప్పారు. నియోజకవర్గంపై పెత్తనం కోసమే చినరాజప్ప, ఆయన వర్గం తెర వెనుక ఇదంతా జరిపిస్తున్నారని ఆ సందర్భంగా సత్తిబాబు అప్పట్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇటీవల చంద్రబాబుతో భేటీ వరకూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే.. రూరల్‌ నియోజకవర్గ పార్టీ సమీక్షకు సత్తిబాబు దంపతులు గైర్హాజరయ్యారని తెలిసింది. మరోపక్క సత్తిబాబు పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, నియోజకవర్గంలో ఆయన పెత్తనం లేకుండా చేయాలనే గట్టి పట్టుదలతో వైరి వర్గానికి చినరాజప్ప వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం కూడా ఇన్‌ఛార్జి మార్పునకే మొగ్గు చూపుతున్నట్టు టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కొండబాబుతో ఢీకొంటున్న పావని వర్గం

తాను మేయర్‌ పదవిని కోల్పోవడానికి కారణమైన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబుపై) సుంకర పావని వర్గం గుర్రుగా ఉంది. కాకినాడ సిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పావని భర్త సుంకర తిరుమలకుమార్‌ ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు అనుచరుడిగా ఉండేవారు. వీరంతా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వర్గంగా పార్టీలో ఓ వెలుగు వెలిగారు. 2017లో జరిగిన కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50 స్థానాలకుగాను 33 స్థానాలు సాధించి టీడీపీని నగరపాలక సంస్థలో అధికారంలోకి తెచ్చారు. పావనిని మేయర్‌గా ఎంపిక చేయడంలో కొండబాబు కీలకపాత్ర పోషించారు. అయితే మేయర్‌గా అధికారం చేపట్టిన కొద్దికాలానికే సుంకర పావని, ఆమె భర్త తిరుమలకుమార్‌ ఒంటెత్తు పోకడలకు పోయారు. చాలామంది కార్పొరేటర్లు ఈ పోకడను వ్యతిరేకించారు. కొండబాబుకు మేయర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే కొండబాబును కూడా మేయర్‌, ఆమె భర్త పట్టించుకోకుండా కాకినాడ సిటీలో తమ ప్రాబల్యం పెంచుకొనే విధంగా వ్యవహరించారు. దీంతో కొండబాబు అసంతృప్త కార్పొరేటర్లను మేయర్‌ వర్గానికి వ్యతిరేకంగా ఒక గ్రూపుగా నడిపించారు. దీంతో పార్టీలో మేయర్‌ పావని ఒంటరి అయ్యారు.

దీనికితోడు మిగిలిన పార్టీల్లోని కార్పొరేటర్లు కూడా మేయర్‌ పావని వ్యవహార శైలిపై అసంతృష్తితో ఉండడంతో పార్టీలకు అతీతంగా అవిశ్వాసం ప్రతిపాదించగా పావని మేయర్‌ పీఠాన్ని కోల్పోవలసి వచ్చింది. అయితే అప్పట్లో కొండబాబు చక్రం అడ్డువేస్తే తన మేయర్‌ పీఠం నిలబడేదని సుంకర పావని భావిస్తున్నారు. కొండబాబు వర్గ రాజకీయం నడిపి, మేయర్‌ పీఠానికి ఎసరు తెచ్చి పార్టీకి నష్టం చేకూర్చారని ఆమె సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే సీటు తెచ్చుకొని కాకినాడ సిటీ స్థానానికి పోటీ చేస్తానని కొండబాబుకు ఆ విధంగా చెక్‌ చెబుతానని పావని అంటున్నారట. అయితే సుంకర పావనికి, తిరుమలకుమార్‌కు అంత సీన్‌ లేదని, వచ్చే ఎన్నికల్లో సీటును తమ నాయకుడికే అధిష్గానం కేటాయిస్తుందని కొండబాబు వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేయర్‌ పీఠం కోల్పోయి ఇప్పటికే పరువు పోగొట్టుకున్న టీడీపీ నాయకుల వర్గ పోరు కారణంగా మరింత చులకన అవుతోందని, అధిష్టానం వీరి ఆధిపత్య రాజకీయాన్ని అడ్డుకోవాలని పార్టీ కేడర్‌ కోరుకుంటోంది.

Also Read : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు బ్యాచ్ కు భంగపాటు