iDreamPost
android-app
ios-app

కేర‌ళ గోల్డ్ స్కాంలో ఈడీపై రివ‌ర్స్ కేసు

కేర‌ళ గోల్డ్ స్కాంలో ఈడీపై రివ‌ర్స్ కేసు

కేరళ గోల్డ్ స్కామ్ కేసు చిత్ర‌, విచిత్ర మ‌లుపులు తిరుగుతోంది. ఈ కుంభకోణంలో సీఎం పినరయి విజయన్‌కు సంబంధం ఉందంటూ నిందితురాలు స్వప్న సురేశ్ గ‌తంలోనే‌ బాంబు పేల్చింది. కేవలం సీఎం మాత్రమే కాదు ముగ్గురు క్యాబినెట్‌ మినిస్టర్లు సైతం గోల్డ్‌ స్కాం వెనక ఉన్నారంటూ నోరు విప్పింది. ఇందులో కేరళ అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. అసలే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రతిపక్షాలకు దీన్ని ప్రధాన ఆయుధంగా మార్చుకున్నాయి. కేరళ కమ్యునిస్టు కుంభకోణంలో మునిగి తేలారంటూ బీజేపీ నేతలు ఆరోప‌ణ‌లు ఎక్కుపెడుతున్నారు. స్వప్న ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రాజకీయాల్లో పెను దుమారం రేగుతుంటే ఇప్పుడు మ‌రో ట్విస్ట్ ఎదురైంది.

ఈ కేసులో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపైనే కేసు నమోదు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ చేత ఈడీ అధికారులు బలవంతంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును చెప్పించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసారు. దీనికి సంబందించిన ఎఫ్ఐఆర్ ను ఎర్నాకుళం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో దాఖలు చేశారు. సాధార‌ణంగా దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేస్తాయి. కేరళలో మాత్రం సీన్ రివర్స్ అయింది.

కేరళలో వెలుగు చూసిన గోల్డ్ స్కాంలో భాగంగా హవాలా కేసుపై ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ప్రశ్నించారని ఈ ఎఫ్ఐఆర్ లో క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఈ కేసులో సీఎం పినరయి విజయన్‌ను ఇరికించే ఉద్దేశంతో ఆయన పేరును చెప్పే విధంగా స్వప్నను బెదిరించారని పేర్కొంది. ఈ విషయంలో ఈడీ అధికారులు కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. సీఎం కు హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు దస్తావేజును తయారు చేశారని ఆరోపించింది కేరళ క్రైమ్ బ్రాంచ్. మరోవైపు స్వప్నకు సంబంధించినదిగా చెప్తున్న ఒక ఆడియో క్లిప్‌పై అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిజుమోన్ గతంలో దర్యాప్తు చేశారు. ఆ క్లిప్ పై ఆయన సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది.

సీఎం విజయన్ కి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని తనను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని స్వప్న చెప్పినట్లు ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంపై కొందరు మహిళా పోలీసులు కూడా ఈడీ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు.ఈ కేసులో సీఎం విజయన్ పాత్ర ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని స్వప్నను ఈడీ అధికారులు నిర్బంధించారని ఆ మహిళా పోలీసులు సాక్ష్యం చెప్పారు.

యూఏఈ నుంచి 30 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా గ‌తంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో స్వప్న సురేష్, సందీప్ నాయర్ నిందితులుగా ఉన్నారు. వీటి విలువ 15 కోట్లు ఉంటుందని ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ గోల్డ్‌ స్కాంలో ఈడీ కూడా ఇన్వాల్వ్‌ అయింది. స్వప్న సురేశ్‌, సందీప్‌ నాయర్‌లను ప్రశ్నించిన ఈడీ.. 303 పేజీల ఛార్జిషీటు కూడా దాఖలు చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ చేయటంలో స్వప్న సురేష్ కీలక సూత్రధారి అని ఈడీ నిర్థారించింది. ఈ విచారణలో భాగంగానే.. గోల్డ్ స్కామ్‌ వెనక సీఎం విజయన్‌తో పాటు ముగ్గురు మంత్రులు ఉన్నారని స్వప్న సురేశ్ చెప్పిన వివ‌రాల ఆధారంగా కేసు ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీపైనే ఇప్పుడు కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.