Idream media
Idream media
తెలంగాణలో తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనానంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ కార్యాలయాలకు బాధితులు పెట్రోల్ తీసుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. భూమి, ఇతర సమస్యలపై ఎన్నో వ్యయ ప్రయాసలతో కార్యాలయాలకు వచ్చే ప్రజలను రెవెన్యూ అధికారులు, సిబ్బంది పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. ఏదైనా గట్టిగా నిలదీస్తే…ఇక ఆ సమస్యకు ఎప్పటికీ మోక్షం కలగదనే భయంతో రైతులు, ఇతర ప్రజానీకం కోపాన్ని దిగమింగుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతిలో స్పందనపై కడప, చిత్తూరు జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్య రాజ్ చెప్పిన ఒకట్రెండు సంఘటనలు విన్న తర్వాత రెవెన్యూ వారిపై పెట్రోల్ పోసి తగలపెట్టక ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.
“తిరుపతి రూరల్ పరిధిలోని ఓ రైతు పట్టదారు పాసు పుస్తకం కోసం 2014 నుంచి 2018 వరకు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఒకట్రెండు కాదు లెక్కలేనన్ని అర్జీలు సమర్పించాడు. అయినా తహశీల్దార్లలో చలనం లేకపోయింది. ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత డివిజనల్ సబ్ కలెక్టర్ కూడా గతంలో లిఖిత పూర్వక ఉత్తర్వు ఇచ్చాడు. అయినా పట్టించుకోలేదు. సరే 2019లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతైనా సమస్య పరిష్కారం అవుతుందని ఆ రైతు స్పందనలో అర్జీ ఇచ్చాడు. అప్పుడు ఆ తహశీల్దార్ ఇవేవి పరిశీలించకుండా తిరిగి మీసేవలో దరఖాస్తు చేయాలని చెప్పడం సమంజసమా?”ముఖ్యమంత్రి కార్యదర్శే స్వయంగా వందలాది మంది అధికారుల సమక్షంలో ఓ రైతు దురవస్థ గురించి విషాధ కథ కాని కథను చెప్పారు. ఇంత దుర్మార్గంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తుంటే పెట్రోల్ పోసి తగటపెట్టక ఏం చేస్తారు?
ఆయనో ఇంకో విచిత్రం గురించి చెప్పారు.
“కృష్ణా జిల్లాలో ఓ వృద్ధురాలు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించింది. అధికారులు ఆమె అడిగిన పనికాకుండా డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. ఇచ్చే అర్జీ ఒకటైతే పరిష్కారం మరొకటి చూపుతున్నారు. ఇలా అయితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు” అని ముఖ్యమంత్రి కార్యదర్శి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో అధికారులు, సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో సాల్మన్ చెప్పిన రెండు ఉదాహరణలే చాలు. ఇలాగైతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరికతోనైనా రెవెన్యూలో మార్పు వస్తే…ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంది?