iDreamPost
iDreamPost
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ దళితుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ దళితులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో ఉన్నట్టుండి పొలిటికల్ గేమ్ మారడానికి ప్రధాన కారణం.. కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం. ఈ స్కీమ్ ద్వారా దళితులకు రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇదే సమయంలో బీఎస్సీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటీవల దళిత, గిరిజన దండోరాలు నిర్వహిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దళితుల అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. దళిత గిరిజనుల బిడ్డల చదువుల కోసం అత్యధిక బడ్జెట్ కేటాయిస్తూ తొలి సంతకం చేస్తానని రేవంత్ తాజాగా ప్రకటించారు.
దళిత, గిరిజన దండోరాల పేరుతో రేవంత్ రెడ్డి సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లిలో రెండు రోజుల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బహుజన్ భవన్ గా మారుస్తానని వెల్లడించారు. అక్కడి నుండే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చూస్తామన్నారు. దళిత, గిరిజన, ఆదివాసుల బిడ్డలు చదువుకోవాలని, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లు కావాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే దళిత గిరిజనుల బిడ్డల చదువుల కోసం అత్యధిక బడ్జెట్ కేటాయిస్తూ సంతకం చేస్తారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల చదువు కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ‘సీఎం ఎవరైనా సరే’ సంతకం చేస్తారని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తనకు సీఎం కావాలనే ఆశ లేదని, తాను ఈ స్థాయికి రావడమే సంతోషమని కూడా ఆయన చెబుతున్నారు. సోనియా గాంధీ ఇచ్చిన అతిపెద్ద పదవి పీసీసీ అని అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్లినా కొందరి వ్యక్తులతో ‘సీఎం.. సీఎం.. సీఎం’ అని పిలిపించుకోవడం ఎందుకు అంటూ సొంత పార్టీ నేతలే రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. రేవంత్ పగటి కలలు కంటున్నారని, 72 సీట్లు, సంతకాలు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని అధికార టీఆర్ఎస్,ఇతర ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
Also Read : తెలంగాణకు రెండో రాజధాని..?