iDreamPost
iDreamPost
దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్న నేతలకే అందని పీసీసీ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుని ఔరా అనిపించారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో పార్టీలోని చాలా మంది సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడారు. కొందరు పబ్లిక్ గా మాట్లాడితే.. మరికొందరు తమ సన్నిహితుల ముందు అసంతృప్తి వెళ్లగక్కారు. ఇంకొందరైతే ఏఐసీసీకి లేఖలు రాశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే.. రేవంత్ కు పీసీసీ ఇవ్వడాన్ని ఓటుకు నోటు కేసుతో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు రేవంత్. పైగా పార్టీలోని సీనియర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజూ ఎవరో ఒకరిని కలుస్తున్నారు.
పార్టీ పునరేకీకరణ
తాను పీసీసీ చీఫ్ గా ఉన్నా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, సమష్టి నిర్ణయాలే ఉంటాయని రేవంత్ చెబుతున్నారు. తెలంగాణలో ప్రజా పునరేకీకరణ జరగాలని చెబుతున్నారు. అయితే అంతకుముందే.. దిక్కులకు ఒకరుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లను ఏకం చేసేందుకు వాళ్లను కలుస్తున్నారు. పెద్దలను కలిసి.. వారి ఇగోను సంతృప్తి పరుస్తున్నారు. రోజూ ఎవరో ఒకరిని కలుస్తున్నారు. తనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లు ఏఐసీసీ ప్రకటించిన రోజు రాత్రే.. కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీని రేవంత్ కలిశారు. వారి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.
Also Read : తెలంగాణలో పోటాపోటీ పాదయాత్రలు!
ఇక రేవంత్ రాక నుంచి.. పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం దాకా ప్రతి విషయంలోనూ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు (వీహెచ్) వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయన్ను కూడా కలిశారు రేవంత్ రెడ్డి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్ ను కలిసి పరామర్శించారు. పార్టీ అభివృద్ధి విషయంలో తనకు వీహెచ్ కొన్ని సలహాలు ఇచ్చారని, సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, సీతక్క తదితరులు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ఇక మొన్నటి దాకా పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తటస్థ వైఖరితో కనిపించారు. కొత్త పీసీసీ కమిటీకి శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. పార్టీ కోసం కష్టపడి చేస్తున్న వారికి అవకాశాలు ఇవ్వాలని అన్నారు. తనకు పదవీ ఉన్నా లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా.. మర్రి శశిధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కోమటి రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ముందు తీవ్రంగా స్పందించినా తర్వాత సైలెంట్ అయ్యారు.
బాధ్యతల స్వీకరణ భారీగా..
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పెద్దలను కూడా రప్పించాలని భావిస్తున్నారు. బాధ్యతల స్వీకరణకు మాత్రమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు బలం చూపే కార్యక్రమంలా, పార్టీలోని నేతలను ఒక్కటి చేసే కార్యక్రమంలా చేపట్టాలని అనుకుంటున్నారు. అందుకే ఆలస్యంగా జులై 7వ తేదీన ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ లోపు మరింత మంది సీనియర్లను కలవనున్నారు. తనను కలిసేందుకు ఎవరూ రావద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆయనతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : తొలి పరీక్షలో నెగ్గితే రేవంత్ రెడ్డికి తిరుగులేనట్లే..!