iDreamPost
android-app
ios-app

తెలంగాణలో పోటాపోటీ పాదయాత్రలు!

  • Published Jul 01, 2021 | 6:57 AM Updated Updated Jul 01, 2021 | 6:57 AM
తెలంగాణలో పోటాపోటీ పాదయాత్రలు!

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ముహూర్తంలో పాదయాత్ర ఆలోచన చేశారో గానీ.. అన్ని పార్టీలు దాన్నే ఎన్నికల విజయసూత్రంగా భావిస్తున్నాయి.. అనుసరిస్తున్నాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ శ్రీకారం చుట్టిన పాదయాత్ర ఆయన్ను, కాంగ్రెసును అధికార తీరానికి చేర్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ కూడా తండ్రి బాటలోనే నడిచి అపూర్వ విజయం సాధించారు. ఇప్పుడు అదే పాదయాత్ర సూత్రం తెలంగాణ నేతలను ఊరిస్తోంది. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఆయనకు పోటీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రికుడిగా మారతారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

రాజన్న రాజ్యం తెచ్చిన ప్రజా ప్రస్థానం

1999లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయి. విద్యుత్ కోతలు, తీవ్ర వర్షాభావ పతిస్థితులు, సంక్షేమ పథకాల్లో కోతలతో ప్రజలు అల్లాడిపోయారు. ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకొని, కన్నీళ్లు తుడిచేందుకు 2003లో ప్రజా ప్రస్థానం పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం వరకు సాగిన ఈ యాత్రలో వైఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారి ఆదరాభిమానాలు 2004 ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాయి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన పూర్తిగా వారి సేవకే వినియోగించారు. వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజన్న రాజ్యాన్ని ఆవిష్కరించారు. అవే ఆయన్ను రెండోసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చాయి. వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ ఫార్ములానే అనుసరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వైఎస్ ఆకాలమరణంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆదరణ కోల్పోతున్న తరుణంలో చంద్రబాబు 2012లో పాదయాత్ర చేపట్టినా.. మధ్యలో విశాఖ వద్దే దాన్ని ముగించేశారు. ఆయన పాదయాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాల్లో 2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి, జనసేన మద్దతు కూడగట్టి మాత్రమే ఆయన అధికారంలోకి రాగలిగారు.

Also Read : ఎన్ని రక్షణ సమితులకు అధ్యక్షుడో ఈ కొలికపూడి

ఇక 2014 ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో అధికారం అందుకోలేకపోయిన వైఎస్ జగన్ తండ్రి వైఎస్ బాటలోనే సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిరంతరం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద సంకల్పం పూని ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల మీదుగా 3600 కిలోమీటర్లకుపైగా.. నెలల తరబడి నడిచారు. మారుమూల పల్లెల తలుపు తట్టారు. పేదల గుండె చప్పుడు విన్నారు. వారి కష్టాలు స్వయంగా చూశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి కష్టాలనే తన మేనిఫెస్టోగా మార్చి నవరత్నాలను పొదిగారు. అపూర్వ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. రాజన్న రాజ్యాన్ని మళ్లీ స్థాపించారు.

తెలంగాణలో అదే సీన్

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్, జగన్ లను అందలం ఎక్కించిన పాదయాత్రలు ఇప్పుడు తెలంగాణ నేతలను ఊరిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఆ ఘనత దక్కించుకోలేక అధికారం అందక అల్లాడిపోతున్న కాంగ్రెస్ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారానే అధికారానికి చేరువ కావాలని భావిస్తున్నట్లు ఉంది. ఆ దిశగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో పాగా వేయాలని కలలు గంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రేవంత్ కు పోటీగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా పార్టీలో సీనియర్లను బుజ్జగించి, చేరిపోయిన కార్యకర్తలను సమీకరించి.. 2022లో సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించాలని రేవంత్ ఆలోచిస్తున్నారు. మొత్తానికి టీఆర్ ఎస్ నుంచి అధికారం చేజిక్కించుకునేందుకు రెండు జాతీయ పార్టీలు పాదయాత్రనే మార్గంగా భావిస్తుండటం విశేషం.

Also Read : తొలి పరీక్షలో నెగ్గితే రేవంత్‌ రెడ్డికి తిరుగులేనట్లే..!