Idream media
Idream media
జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక, టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన నాటి నుంచీ కొత్త సారథి ఎంపిక పై అధిష్ఠానం కసరత్తు చేస్తూనే ఉంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు వినిపించాయి. ఇదిగో పీసీసీ సారథి, అదిగో పీసీసీ సారథి అంటూ రోజుకో పేరు ప్రచారంలో ఉండేది.
రేవంత్ రెడ్డికి ఖరారైందని అనుకుంటుండగా, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముందు జీవన్ రెడ్డి పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. పీసీసీ సారథి ఆయనే అని మీడియాలో క థనాలు కూడా వెలువడ్డాయి. అయితే, ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ప్రకటించవద్దని జానారెడ్డి సహా, పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకుల వినతి మేరకు ప్రకటన వెలువడలేదు. ఎన్నిక ముగిసి నెలపైనే అయినప్పటికీ అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడలేదు. తాజాగా పీసీసీ సారథిగా రేవంత్ రెడ్డి నియామకమైనట్లు తెలుస్తోంది. ఆయన ఎంపిక లాంఛనమేనని, ప్రకటనే తరువాయి అని ప్రచారం జరుగుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో పాటు తెలంగాణలోని నాగార్జున ఉప ఎన్నిక పూర్తయిన నాటి నుంచీ తెలంగాణ టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో నాయకత్వం మార్పుపై కాంగ్రెస్ మరోసారి ఫోకస్ పెట్టిందనే ఊహాగానాలు ఇటీవల మొదలయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డి అభిమానుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. తమ నాయకుడికి కాంగ్రెస్‌కు సారథ్యం వహించే పదవి దక్కుతుందని వాళ్లు భావిస్తున్నారు. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాతే టీపీసీసీ కొత్త బాస్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని భావించినా.. అప్పుడు అంతకంటే ముందే టీపీసీసీ సారథి ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా, రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు ఆపలేదు. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా ఓకే అంటూనే టీపీసీసీ పై దృష్టి కొనసాగిస్తూనే ఉన్నారు. రైతుల కోసం పాదయాత్ర కూడా చేశారు. ‘‘రైతన్నా… నేటి నా గొంతులో ఆవేదన, రేపటి నీ బతుకులో వాస్తవం… అందుకే… రేపటి వరకు వద్దు… ఈ రోజే చరిత మార్చేద్దాం రా… తరలిరా.. రావిరాలకు’’… బహిరంగ సభ పెట్టి తన బలమేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
అలాగే, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలుపు కోసం పోరాడారు. జానారెడ్డి కొడుకుగా ఓట్లు అడుగుతున్నా అంటూ ప్రచారంలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే టీఆర్ఎస్ ప్రముఖులపై భూ కబ్జాలను ఆధారాలతో వెలుగులోకి తెచ్చి హడావిడి చేశారు. ఈ క్రమంలోనే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి అధిష్ఠాన పెద్దలను కూడా కలిశారు. అలాగే ఇటీవల కేంద్రం తీరుపై కూడా రేవంత్ ఆరోపణలు చేస్తూ పార్టీలో పతాకశీర్షిక నిలిచారు. ఇవన్నీ పరిశీలించిన అధిష్ఠానం రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ వంటి డేరింగ్ పర్సన్ అయితేనే మేలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీపీసీసీ బాధ్యతలు ఆయనకే అప్పగించనుంది.