iDreamPost
android-app
ios-app

సీజేకి జగన్ లేఖ అందుకే రాసుంటారు

సీజేకి జగన్ లేఖ అందుకే రాసుంటారు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాయడంపై జస్టిస్‌ శ్రీనివాస రంగనాథ వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తోటి వ్యవస్థలలో న్యాయమూర్తులు మితి మీరిన జోక్యం చేసుకోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు కలిగాయని అభిప్రాయపడ్డారు.

సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ఉమ్మడి ఏపీ హైకోర్టుతో పాటు అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస రంగనాథ వర్మ తన స్పందనను తెలియచేశారు. ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులని గుర్తు చేసిన ఆయన ప్రభుత్వానికి నష్టం కలిగేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థలు వ్యవహరించరాదని సూచించారు. తోటి వ్యవస్థలలో మితి మీరిన జోక్యం చేసుకోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు కలిగాయని అభిప్రాయపడ్డారు.

అందుకే జగన్ లేఖ రాసుంటారు

ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై న్యాయస్థానాలు స్టే విధించడం, బెంచ్ నుంచి ప్రభుత్వాలపై ఇష్ఠానుసారంగా కామెంట్స్ చేయడం, డీజిపి స్థాయి లాంటి వ్యక్తిని కోర్టుకు పిలిపించి సెక్షన్లు చదివించడం లాంటి చర్యలతో ఏపీ ప్రభుత్వం అభద్రత భావానికి లోనయిఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వరుస వ్యతిరేక తీర్పులతో బాధతోనే జగన్ సీజేకు లేఖ రాసుంటారని అభిప్రాయపడ్డారు. సీఎం లేఖ రాయడం కోర్టు ధిక్కారణ కిందకు రాదని ఒకవేళ కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకుంటే ప్రభుత్వాల గొంతు నొక్కడం అవుతుందని పేర్కొన్నారు. న్యాయమూర్తులపై ఫిర్యాదులు వచ్చినా విచారణ జరిపితే అది ప్రజలలో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

జస్టిస్ అనుమానాలు

న్యాయమూర్తులను నియమించేందుకు గతంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి నుంచి ఒక లేఖ వచ్చిందని… అదే లేఖ మక్కీకి మక్కీగా నాటి ప్రభుత్వాధినేత నుంచి మరో లేఖ వచ్చిందన్నారు. రెండు లేఖలు ఒకేలా ఉన్నాయన్నారు. దాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలపై ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని ఇలాంటి వాటిపై విచారణ జరిగితేనే న్యాయస్థానాలపై నమ్మకం పెరుగుతుందని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం గత ప్రభుత్వ అధినేతకు బాగా తెలుసని ఓ రీసెర్చ్ స్కాలర్ చెప్పారని గుర్తు చేశారు.

భారత న్యాయవ్యవస్థపై ఇంగ్లాండ్ బర్మింగ్‌ హోం యూనివర్శిటీకి చెందిన ఓ వ్యక్తి 2004లో తన పరిశోధనలో రాసిన విషయాన్ని జస్టిస్ డీఎస్‌ఆర్‌ వర్మ పేర్కొన్నారు. ‘అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టు కలిగి ఉన్నారని తన పరిశోధన పత్రంలో చెప్పారు. ఆ ముఖ్యమంత్రి ఎవరో కూడా అందరికీ తెలుసన్నారు. విదేశీ స్కాలర్స్‌ కూడా భారత న్యాయవ్యస్థ గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే జగన్ రాసిన లేఖ రాయడం చర్య తప్పు కాదంటూ పలువురు న్యాయ నిపుణులు తమ తమ స్పందనను తెలియచేశారు. న్యాయవ్యవస్థలోని లోపాలపై ప్రధానన్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాయడంలో తప్పు లేదని ఏపీ ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్‌ కూడా అభిప్రాయపడ్డారు.