Idream media
Idream media
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార పక్షం వైసీపీ సహా విపక్షాలు, పలు సంఘాలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఈ నిర్ణయాన్ని ఏపీలోని జగన్ సర్కారు సైతం వ్యతిరేకించింది. అంతేకాదు.. ఈ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన ప్లాన్ ను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారు. ఆ పార్టీ ఎంపీలందరూ దీనిపై కేంద్ర పెద్దలను పలుమార్లు కలిశారు కూడా. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరించొద్దని జగన్ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కోరింది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం ఆమోదించి పంపుతామని గతంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమ సంఘాల నాయకులను కలిసిన సందర్భంలో జగన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు తన హామీ నెరవేర్చుకున్నారు.
తాజాగా నిర్వహించిన ఏపీ బడ్జెట్ సమావేశం సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి.. ఆమోదించారు. ప్రైవేటీకరణకు భిన్నంగా తన లేఖ ద్వారా ఐదు ప్రత్యామ్నాయాల్ని ఇప్పటికే సీఎం జగన్ చూపించారని పేర్కొన్నారు ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఏపీ అసెంబ్లీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న విషయాన్ని తాజా తీర్మానంతో స్పష్టం చేశారని చెప్పాలి. విశాఖ ఉక్కును రక్షించుకోవటం కోసం ఏ మార్గానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఇప్పటికే స్పష్టం చేసిన జగన్ సర్కారు.. తాజాగా తన చేతలతో మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి. ప్రాణవాయువు లేక దేశం అల్లాడుతున్న తరుణంలో దేశానికి ఆక్సిజన్ అందించి స్టీల్ ప్లాంట్ ఆదుకున్న విషయం విదితమే. తాజాగా ఆ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.