iDreamPost
android-app
ios-app

ఇందిర‌మ్మ‌ని మ‌రిచిపోగ‌ల‌మా?

ఇందిర‌మ్మ‌ని మ‌రిచిపోగ‌ల‌మా?

చిన్న‌ప్పుడు స్కూల్లో ఒక బిట్ క్వ‌శ్చ‌న్ వుండేది. మ‌న ప్ర‌ధాన‌మంత్రి ఎవ‌రు అని, దీనికి అంద‌రూ క‌రెక్ట్‌గానే రాసేవాళ్లు. ఎందుకంటే ఇందిరాగాంధీ పేరు తెలియ‌ని వాళ్లు ఎవ‌రుంటారు?

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిర‌మ్మ ఒక దేవ‌త. న్యూస్ రీల్‌లో ఆమె క‌నిపిస్తే చ‌ప్ప‌ట్లే చ‌ప్ప‌ట్లు. ఆ యుద్ధం వ‌ల్ల పోస్ట్‌కార్డ్ నుంచి సినిమా టికెట్ల వ‌ర‌కూ అన్ని ధ‌ర‌లు పెరిగాయి. కార్డు ఐదు పైస‌లు పెంచి శ‌ర‌ణార్థుల స్టాంప్ అతికించారు. నిరాశ్ర‌యులుగా వున్న ఆ బొమ్మ చూసి బాధ‌గా అనిపించేది. సినిమా టికెట్ ప‌ది పైస‌లు పెరిగింది. ఆ భారాన్ని పెద్ద‌వాళ్లు మోసారు, పిల్ల‌లం మాత్రం యుద్ధంలో గెలిపించిన ఇందిర‌మ్మ‌ని జై కొడుతూ వుండేవాళ్లం.

72లో ప్ర‌త్యేకాంధ్ర ఉద్య‌మం వ‌చ్చి స్కూళ్లు మూసేశారు. కొన్ని నెల‌లు సెల‌వులు వ‌చ్చాయి. ఆ ఉద్య‌మంలో ఇందిర‌మ్మ‌ని తీట్టేవాళ్లు. 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న నాకు అది న‌చ్చేది కాదు. 1974లో రాయదుర్గం ఉప ఎన్నిక వ‌చ్చింది. సిటింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి గుండె పోటుతో చ‌నిపోయాడు. కాంగ్రెస్ త‌ర‌పున ప‌య్యావుల వెంక‌ట‌నారాయ‌ణ (ప‌య్యావుల కేశ‌వ్ తండ్రి). ప్ర‌తిప‌క్షం లేని కాలం కాబ‌ట్టి ఇండిపెండెంట్‌గా నాయ‌కుల రంగ‌ప్ప నిల‌బ‌డ్డాడు.

వెంక‌ట‌నారాయ‌ణ పెద్ద భూస్వామి, సంప‌న్నుడు. ఆయ‌న‌తో పోలిస్తే రంగ‌ప్ప చాలా పేద‌వాడు. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాల‌ని ఆయ‌న కోరిక‌. గొర్రులు, మేక‌ల్ని అమ్మిన డ‌బ్బుతో పోటీ చేశాడు. వాల్మీకుల ఓట్లు ఏక్కువున్నాయి కాబ‌ట్టి గెలుస్తాన‌నే గుడ్డి న‌మ్మ‌కం ఆయ‌న‌ది.

ఇందిర‌మ్మ గుర్తు ఆవు దూడ కాబ‌ట్టి వంద‌లాది ఆవుదూడ‌ల్ని వూరంతా వూరేగించారు. రంగ‌ప్ప గుర్తు ఏనుగు. అయితే ఆ మొండి మ‌నిషి క‌ర్నాట‌క నుంచి రెండు ఏనుగుల్ని తెప్పించి ప్ర‌చారం చేశాడు.

ఇందిర‌మ్మ ఆవుదూడ ముందు ఏనుగు ఎగిరిపోయింది. రంగ‌ప్ప రోడ్డున ప‌డ్డాడు.

త‌ర్వాత ఎమ‌ర్జెన్సీ వ‌చ్చింది. ఇందిర‌మ్మ పాల‌న అద్భుత‌మంటూ పిల్ల‌ల‌తో పొగిడిస్తూ వ్యాస పోటీలు పెట్టేవాళ్లు. చాలా పోటీల్లో పాల్గొన్నా కానీ బ‌హుమ‌తి రాలేదు.\

77లో నేను టెన్త్ క్లాస్‌. ఇందిర‌మ్మ ఓడిపోయిందని బాధ‌ప‌డ్డాను. 80లో మ‌ళ్లీ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన‌పుడు సంతోషించా. రాజ‌కీయాలు అర్థం చేసుకునే వ‌య‌సు వ‌చ్చింది. NTR గెల‌వాల‌ని కోరుకున్నా. కోపం కాంగ్రెస్‌పైనే. కానీ ఇందిర‌మ్మ మీద కాదు. ఇది నా ఒక్క‌డి ఫీలింగ్ కాదు. మెజార్టీ ప్ర‌జ‌ల ఫీలింగ్‌.

ఇందిరాగాంధీని ఈ దేశ ప్ర‌జ‌లు Own చేసుకున్నారు. సంజ‌య్‌గాంధీ చ‌నిపోయిన‌పుడు ఆమె ఒక్క‌రే కాదు, ఎంతో మంది త‌ల్లులు క‌న్నీళ్లు పెట్టారు. ప్ర‌జ‌ల్ని ఇంత‌గా ప్ర‌భావితం చేసిన నాయ‌కురాలు మ‌ళ్లీ పుట్ట‌లేదు.

అకాలీదళ్‌ని తొక్కేసే క్ర‌మంలో బిందైన్‌వాలాని ఆమె ఉపేక్షించారు. బ్లూస్టార్ ఆప‌రేష‌న్ అనివార్య‌మైంది. అదే ఆమెని బ‌లి తీసుకుంది. న‌వంబ‌ర్ 19 ఇందిరాగాంధీ పుట్టిన రోజు.

ఈ రోజు కాంగ్రెస్ భ్ర‌ష్టు ప‌ట్టి అవ‌సాన ద‌శ‌లో వుండొచ్చు కానీ, ఆ పార్టీ ఇందిరాగాంధీ హ‌యాంలో వెలిగిన వెలుగుని ఎవ‌రూ మ‌రిచిపోలేరు. మ‌త‌త‌త్వ శ‌క్తులు నోర్మూసుకుని కూచున్న కాలం ఒక‌టుండేది. అదే ఇందిరాగాంధీ కాలం. భార‌త చ‌రిత్ర‌లో ఆమె కోసం కొన్ని పేజీలుంటాయి. ఎమ‌ర్జెన్సీ మ‌ర‌క ప‌డిన పేజీ కూడా అందులో ఒక‌టి.