Idream media
Idream media
ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులకు లాక్ డౌన్ నేపథ్యంలో పడుతున్న ఇబ్బందులు నుంచి ఉపశమనం లభించనుంది. వలస కార్మికులు వారి వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, భక్తులు లాక్ డౌన్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారందరూ వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం వలస కార్మికుల తరలింపుపై ఇరు రాష్ట్రాలు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం నోడల్ అధికారులను, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించాలి. వలస కార్మికులు స్వస్థలాలకు పంపించే ముందు కరోనా పరీక్షలు నిర్వహించాలి. కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయితే వారిని పంపేందుకు అనుమతి ఇవ్వాలి. బస్సులలో 50 శాతం మంది మాత్రమే ప్రయాణించాలి. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత స్థానికంగా ఉన్న అధికారులు వారికి పరీక్షలు నిర్వహించాలి. ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే క్వారంటైన్ కు తరలించాలి. అందరూ 14 రోజులు తప్పనిసరిగా హోం క్వారంటైన్ లో ఉండాలి.
కరోనా వైరస్ కట్టడి కోసం గత నెల 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. లాక్ డౌన్ నేపధ్యంలో వలస కార్మికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ఈనెల 14 వ తేదీన లాక్ డౌన్ రెండో దఫా పొడిగింపు సందర్భంగా జారీచేసిన మార్గదర్శకాల్లోనూ వలస కార్మికులు ఎక్కడివారు అక్కడే ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 15వ తేదీన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల్లో తాజాగా మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 31 వేలు దాటింది. మూడో తేదీన రెండో దఫా లాక్ డౌన్ గడువు ముగుస్తోంది. కరోనా నియంత్రణ లోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, సలహాలను తీసుకున్నారు.
కరోనా పాజిటివ్ కేసుల నమోదు పూర్తిగా తగ్గితేనే లాక్ డౌన్ ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఆయా ప్రాంతాల్లో ఉండడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో వలస కార్మికులు తమ స్వస్థలాలకు పంపాలని ఆందోళన చేస్తున్నారు. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. కరోనా వైరస్ ఎప్పటి లోపు అదుపులోకి వస్తుందనేది చెప్పలేని పరిస్థితుల్లో వలస కార్మికులు ఆయా ప్రాంతాల్లో ఉంచడం వల్ల ఇబ్బందులు అధికమవుతాయి అన్న భావనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకే వారందరినీ స్వస్థలాలకు పంపేందుకు నిర్ణయించింది.