iDreamPost
android-app
ios-app

ఏపీలో రికార్డు.. ఒకే రోజు 140 మంది డిశ్చార్జి

ఏపీలో రికార్డు.. ఒకే రోజు 140 మంది డిశ్చార్జి

ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా.. మరోవైపు అదే స్థాయిలో వ్యాధిగ్రస్తులు కోలుకుంటున్నారు. డాక్టర్లు తీసుకుంటున్న చర్యల వల్ల రోజురోజుకూ డిశ్చార్జ్‌ అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 140 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇప్పటివరకు 1,777 కేసులు నమోదు కాగా, మొత్తం 729 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తద్వారా రికవరీ రేటులో ఆంధ్రప్రదేశ్‌ చాలా ముందుకు చేరుకుంది. దేశంలో సగటు రివకరీ రేటు 28.66 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 41.02 శాతానికి చేరుకోవడం గమనార్హం. గత 24 గంటల్లో కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా 61 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కర్నూలు నుంచి 39 మంది, చిత్తూరు నుంచి 20 మంది, అనంతపురం నుంచి 10 మంది, తూర్పుగోదావరి నుంచి నలుగురు, ప్రకాశం, పశ్చిమగోదావరి నుంచి ఇద్దరు చొప్పున, గుంటూరు, వైఎస్సార్‌ జిల్లా నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జ్‌ అయ్యారు.

మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు ‍ప్రకాశం జిల్లాలో 61 మందికిగాను ఏకంగా 52 మంది కోలుకున్నారు. అక్కడ కేవలం 9 మంది మాత్రమే ఆస్పత్రిలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 82 మందికిగాను 68 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నెల్లూరులో 92 మందికిగాను 56 మంది, కృష్ణా జిల్లాలో 300 మందికిగాను 117 మంది, కర్నూలులో 533 మందికిగాను 153 మంది, గుంటూరులో 363 మందికిగాను 129 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మిగతా జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో కోలుకుంటున్నారు. ఇదే వరవడి కొనసాగితే త్వరలోనే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారనున్నాయి. డాక్టర్ల నిరంతర కృషి, అందిస్తున్న వైద్యం, పౌష్టికాహారం కారణంగా కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.