టీడీపీలో కాక రాజుకుంటోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వర్గపోరు ఉధృతమవుతోంది. ఆపార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే పార్టీ నేతలంతా కలిసి చంద్రబాబు వద్ద ఫిర్యాదుల పరంపర సాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త , పార్ట నాయకుడు పిల్లి సత్యన్నారాయణ మూర్తి తీరు మీద ఆరోపణలు చేస్తున్నారు. వారి నాయకత్వంలో పనిచేయలేమని కుంబబద్దలు కొడుతున్నార. దాంతో వ్యవహారం ముదురుతున్నట్టు కనిపిస్తోంది.
కాకినాడ రూరల్ టీడీపీ లో చాలాకాలంగా పిల్లి దంపతలు పెత్తనం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి భర్త సత్యన్నారాయణ మూర్తి అంతా తానై వ్యవహరిస్తున్నారు. 1999 ఎన్నికల్లో అప్పటి సామర్లకోట ఎంపీపీగా ఉన్న పిల్లి అనంతలక్ష్మిని మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు ప్రోత్సహించారు. ఆనాటి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరుమాని సత్యలింగ నాయకర్ స్థానంలో ఆమెకు టీడీపీలో అవకాశం దక్కింది. దాంతో ఆమె తొలిసారిగా బరిలో దిగి సంపర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఆ సమయంలో పిల్లి అనంతలక్ష్మి భర్త పనికి ఆహారపథకం నిధుల్లో భారీ స్థాయి అవినీతికి పాల్పడడంతో పెనుదుమారం చెలరేగింది. చివరకు 2004 ఎన్నికల్లో ఆమెకు టీడీపీ టికెట్ కూడా నిరాకరించే పరిస్థితి వచ్చింది.
Also Read : వచ్చే ఎన్నికలకు అయ్యన్న ఔటేనా!
2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పిల్లి దంపతులు కాకినాడ రూరల్ వైపు మళ్లారు. వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఆమె బరిలో దిగారు. కానీ 2009లో మూడో స్థానంతో సరిపెట్టుకోగా 2014లో మాత్రం విజయం సాధించారు. మళ్లీ 2019లో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. శెట్టిబలిజ కార్డుతో నెట్టుకొస్తున్న పిల్లి కుటుంబంలో భర్త పెత్తనం పెరిగిపోవడం, అవినీతి వ్యవహారాలు, ఒంటెద్దుపోకడ ధోరణితో ప్రజలకు దూరమయ్యారు. చివరకు ఎమ్మెల్యే కుమారులు పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గత ఏడాది అనంతలక్ష్మి కుమారుడికి రహస్యంగా పెళ్లి చేసిన వైనం వివాదానికి దారితీసింది. ఓ ఎస్సీ మహిళను పెళ్లి పేరుతో మోసగించి, మరో మహిళను పెళ్లాడిన వ్యవహారంలో పోలీసు కేసు కూడా నమోదయ్యింది. ఈ కేసులో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పు కూడా నిందితులుగా ఉన్నారు.
ఇప్పుడు చివరకు పార్టీ కార్యకర్తలు కూడా పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ ధాటికి తల్లడిల్లిపోతున్నట్టు కనిపిస్తోంది. వారి వైఖరి మూలంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో క్యాడర్ పార్టీకి దూరమైందని, పార్టీ బలోపేతం కోసం కష్టించి పనిచేసినా కార్యకర్తల బాగోగులు చూసే నాధుడే కరువయ్యారంటూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
Also Read:ఆస్తుల అమ్మకం.. నాగార్జున సాగర్‌ను లీజుకిచ్చేస్తారా..?
మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతిచలపతిరావు, విత్తనాల గోపాల్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్యులు చేసిన ఫిర్యాదు మూలంగా టీడీపీలో అదో పెద్ద పంచాయతీగా మారింది. మాజీ ఎమ్మెల్యే దంపతులతో పార్టీకి ఎటువంటి భవిష్యత్తు లేదని, స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులున్నా, వీరి సహాయ నిరాకరణతో పోటీకి దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వివరించిన వారు, తక్షణమే ఇన్ఛార్జ్ ని మార్చాలని డిమాండ్ చేశారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం పదిహేను రోజుల్లో అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆయా నేతలు శాంతించారు. కానీ ఈ వివాదం కాకినాడ రూరల్ టీడీపీ క్యాడర్ మధ్య కొత్త తగాదా రాజేసినట్టేనని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే కుంగిపోయిన పార్టీలో ఈ విబేధాలు మరింత నష్టపరుస్తాయని అంతా అంచనా వేస్తున్నారు.