రీడర్‌షిప్ సర్వేలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు పాఠకులు తగ్గిపోతున్నట్టు సాక్షికి నిలకడగా ఉన్నట్టు తేలింది. అయితే అది సాక్షి గొప్పతనమేమీ కాదు, దానికి వేరే కారణాలున్నాయి.
సాక్షి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి పేపర్, జగన్ మీద ఈగ వాలినా , ఆ ఈగ సంగతి చూడటం సాక్షి బాధ్యత. జగన్ చిరునవ్వు నవ్వితే, అది హాస్యచతురత అని, ఆయన చూయింగ్ గమ్ నమిలినా (ఒకవేళ అలవాటు ఉంటే) అదేదో సుదీర్ఘ సంభాషణగా భావించడం సాక్షి కర్తవ్యం. ప్రభుత్వ పక్షంలో ఉంటే ఎంతో కొంత డిస్ అడ్వాంటేజీ ఉంటుంది. ఏ లెక్కన చూసినా సాక్షికి పాఠకులు తగ్గాలి.
మరి సత్యాన్ని హెర్క్యులెస్‌లా భుజాన మోస్తున్న ఆంధ్రజ్యోతికి, నిజాలు నిర్భయంగా రాసే ఈనాడుకి పాఠకులు ఎందుకు తగ్గారు. దీనికి కారణం డిజిటల్ మీడియా. అక్కడ అన్నీ సత్యాలు చెబుతారని కాదు కానీ, సత్యం చెప్పడానికి భయపడేవాళ్లు తక్కువ. అబద్ధం వల్ల వాళ్లకి ప్రయోజనాలు కూడా తక్కువే.
ఈనాడు, జ్యోతి సత్యాలు చెప్పడం మానేసి చాలా కాలమైంది. మరి అన్నీ అబద్ధాలే రాస్తారా? అంటే రాయరు. పాక్షిక సత్యాలు రాస్తారు. వాళ్లకు అనుకూలమైన నిజాలు రాస్తారు. ప్రతికూలమైనవి రాయరు.
ఉదాహరణకి మండలి రద్దుని వ్యతిరేకిస్తూ ఈనాడు అనేక కథనాలు, అభిప్రాయాలు రాసింది. మరి 1985లో ఇలాగే రాసిందా? అంటే లేదు. ఆ రోజు తెలుగుదేశాన్ని సమర్థించడం అవసరం. మరి 35 ఏళ్లలో అభిప్రాయాలు మార్చుకోకూడదా? అంటే మార్చుకోవచ్చు. సొంత అభిప్రాయాలన్నీసొంత ప్రయోజనాలకైతేనే కష్టం. పాఠకుల ప్రయోజనం కూడా ముఖ్యం. ఈనాడుకి సర్క్యులేషన్‌తో పాటు పాఠకులు తగ్గడానికి ప్రధాన కారణం విశ్వసనీయత కోల్పోవడం.
జగన్ గెలవడం ఈనాడుకి ఇష్టం లేకపోవచ్చు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని టీ కొట్టు దగ్గర మాట్లాడేవాళ్లకి అర్థమైనప్పుడు, ఈనాడుకి ఎందుకు అర్థం కాలేదు. అర్థం కాక కాదు, తెలుగుదేశం ఓడిపోవడం ఇష్టం లేదు. అందుకే దింపుకు కళ్లెం వార్తలు రాసింది. ప్రజల పక్షాన నిలబడటం మానేసి , తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడినప్పుడే ఈనాడు దిగజారడం మొదలైంది. అయినా నెంబర్ 1గా ఎందుకు ఉందంటే , ఈనాడు చేతిలో మొద్దుకత్తి అయినా ఉంది. ప్రత్యర్థుల చేతిలో కొబ్బరి ఈనెలు ఉన్నాయి. చిన్నపిల్లలు వాటినే కత్తులుగా భావించి “సయ్‌సయ్”మని తిప్పుతూ యుద్ధం చేస్తుంటారు. అందుకు ఈనాడు నెంబర్ 1.
ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఈనాడులాగా ఇక్కడ దాగుడుమూతలు ఉండవు. అబద్ధాన్ని నిజమని నమ్మించడమే కాదు , తాను కూడా బలంగా నమ్ముతుంది. రాధాకృష్ణకి వ్యతిరేకంగా రామచంద్రమూర్తి వ్యాసం రాస్తే దాన్ని ఎడిట్ పేజీలో యధాతథంగా ప్రచురించే ధైర్యశాలి. (ఈనాడులో ఇలాంటివి ఊహించలేం. రామోజీరావుపై ఉండవల్లి కేసు వార్త అన్ని పత్రికల్లో వచ్చినా ఈనాడులో రాలేదు. వాళ్ల ఇంట్లో పెళ్లి జరిగితే దాన్ని మనం పేజీలకు పేజీలు చూడాలి చదవాలి. సాక్షిలో జగన్‌పై కేసుల గురించి చిన్న వార్తలైనా వేస్తారు).
మరి ఆంధ్రజ్యోతి పాఠకులు ఎందుకు తగ్గుతున్నారంటే, అధికారంలో ఉన్న ఐదేళ్లు చంద్రబాబుని మోసి అమరావతిలో అద్భుతాలు జరుగుతాయని చెప్పింది. అమరావతి వల్ల అప్పులు పెరిగాయి కానీ, అద్భుతాలు జరగలేదు. జగన్ వచ్చిన వెంటనే అరాచకాలు, అంతులేని దౌర్జన్యాలు, అమరావతి గొంతు కోయడం , అసలు జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కనీసం 200 ఏళ్లు వెనక్కి వెళుతోందని రాయడానికి కూడా జంకదు.
ఇంగ్లీష్ మీడియం వల్ల క్రైస్తవ మతమార్పిడులు అని రాయగలదు. వైజాగ్ రాజధాని అయితే మొత్తం పులివెందుల వాళ్లు ఇన్నోవాల్లో కత్తులు తిప్పుతూ దిగిపోయి ఉక్కు ఫ్యాక్టరీని కూడా కబ్జా చేయగలరు. సముద్రాన్ని వీలైతే ఎవరికైనా అమ్మేయ గలరు….ఇలా ఏమైనా రాయగలిగే సత్తా ఆంధ్రజ్యోతికి ఉంది.
50 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఉన్నప్పుడు , మతమార్పిడుల శాతం ఎంత అని ఒక్కసారి కూడా ప్రశ్నించుకోదు. అసలు పులివెందులలో జగన్ కుటుంబం మాటే కదా చెల్లుతుంది. మరి అక్కడ మొత్తం క్రైస్తవులే ఉండాలి కదా. ఏదో ఒక రకంగా జగన్‌ని బద్‌నాం చేయాలి, అది పత్రిక పాలసీ.
మరి ఏడు నెలల నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనే అయినపుడు ఆయన మాట రాష్ట్రమంతా చెల్లుతున్నప్పుడు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలు కడప వాసుల కబ్జాలమయంగా మారిపోవాలి కదా! ఎందుకు మారలేదు? కాకపోతే ఇంతకు ముందు ఏమ్ రాసినా అడిగే వారు లేరు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. జనం కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి పత్రికలని మాత్రమే నమ్మడం ఎప్పుడో మానేశారు. రాబోవు రోజుల్లో కూడా పత్రికలు ఏం మారవు. పాఠకులే మారిపోయి , చదవడం తగ్గించేస్తారు.
సాక్షి పాఠకులు నిలకడగా ఎందుకున్నారంటే , విలేకరులతో చందాలు కట్టించడం, రకరకాల స్కీంలతో ఏదో మ్యాజిక్ చేస్తూ ఉంది. దాన్ని భజన పత్రికగా తప్ప ప్రజల పత్రికగా పాఠకులేం గుర్తించడం లేదు.