iDreamPost
android-app
ios-app

Konaseema Railway Line – కోనసీమలో రైల్వే కూతకు ఇంకా ఎంతకాలం?

  • Published Oct 23, 2021 | 2:04 PM Updated Updated Oct 23, 2021 | 2:04 PM
Konaseema Railway Line – కోనసీమలో రైల్వే కూతకు ఇంకా ఎంతకాలం?

రైల్వే కూత వినాలని కోనసీమవాసుల దశాబ్ధాల నుంచి కంటున్న కల నెరవేరేందుకు మరి కొన్నేళ్లు పట్టనుంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఈ రైల్వేలైన్‌ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. కాని ఇప్పటికీ గోదావరి నదీపాయల మీద వంతెనలే పూర్తి కాలేదు. ఇవి పూర్తయ్యేందుకు ఇంకా ఏడాది కాలం పైగా సమయం పట్టే అవకాశముందని నిపుణుల అంచనా కాగా, ఇంకా గోదావరి పంట కాలువలు, మురుగునీటి కాలువలు.. ఛానల్స్‌.. పంట బోదెలు ఇలా పదుల సంఖ్యలో వంతెనలు, కల్వర్టర్లు నిర్మించాల్సి ఉంది. ఆ తరువాత కాని ట్రాక్‌ నిర్మాణం జరిగే అవకాశం లేదు. ఇవన్నీ పూర్తయ్యేందుకు ఇంకా ఎన్నేళ్లు పడుతుందోనని స్థానికులు ఎదురు తెన్నులు చూస్తున్నారు.

కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నర్సాపురం రైల్వేలైన్‌ పొడవు 102.507 కిమీలు. గతంలో కోటిపల్లి వరకు అంటే 45.30 కిమీలో పూర్తయ్యింది. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు 57.20 కిమీలో నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు తొలి అంచనా రూ.1,045.20 కోట్లు కాగా, రెండేళ్ల క్రితం సవరించిన అంచనాలు రూ.2,120 కోట్లుకు చేరింది. ఇది ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు భారీగా నిధుల కేటాయిస్తూ వస్తుంది. 2001 నుంచి 2015 వరకు ఈ ప్రాజెక్టుకు కేటాయించింది కేవలం రూ.90.2 కోట్లు మాత్రమే. వీటిని పెద్దగా ఖర్చు చేసిన దాఖలాలు కూడా లేవు. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు కేటాయింపు భారీగా పెరిగింది. అమలాపురానికి చెందిన బీజేపీ నేత వారణాసి రామమాధవ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో కేంద్రం నిధులు పెంచిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

2016`17 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. 2017`18లో రూ.430 కోట్లు, 2018`19లో రూ.200 కోట్లు, 2019`20లో రూ.200 కోట్లు, 2020`21లో రూ.550 కోట్లు, 2021`22లో రూ.189 కోట్లు చొప్పున కేటాయించారు. మొత్తం రూ.1,769 కోట్ల కేటాయింపులు చేసింది. రాష్ట్రం ప్రభుత్వం తన వాటాగా 25 శాతం మేరకు అనగా రూ.442.25 కేటాయించాల్సి ఉంది. రాష్ట్రం కూడా నిధులు ఇస్తే రూ.2,211.25 కోట్టు కేటాయించినట్టవుతుంది. అంటే దాదాపుగా నిధులు కేటాయించినట్టే.

Also Read : P Gannavaram Aqueduct – రాజోలు దీవి చరిత్రను మార్చిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?

వంతెనలే వంతెనలు..

నిధులు పుష్కలంగా ఉన్నా పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన ఆటంకం గోదావరి నదీపాయల మీద భారీ వంతెనలు నిర్మించాల్సి రావడమే. దీనిలో కోటిపల్లి వద్ద ఏకంగా 3.50 కిమీల పొడవునా వంతెన నిర్మించాల్సి ఉంది. అలాగే బోడసకుర్రు వద్ద 1.50 కిమీలు, దిండి వద్ద 1.30 కిమీల మేర వంతెనలు కట్టాలి. ఇవి కాకుండా 15 వరకు పెద్ద వంతెనలు, 170 చిన్న వంతెనలు, రోడ్డ మీద ఒక వంతెన, రోడ్డు దిగువున 48 వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇన్ని వంతెనలు ఉండబట్టే నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి.

2015 అంచనా ప్రకారం మిగిలిన ప్రాంతాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టు కోసం కిలో మీటరుకు రూ.10 కోట్లు అవుతుండగా, కోనసీమ రైల్వేలైన్‌కు రూ.50 కోట్లు అవుతుందని రైల్వే శాఖాధికారులు చెప్పారు. ఇంత వరకు రూ.667.11 కోట్ల విలువ చేసే మూడు ప్రధాన వంతెన నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. గౌతమీ నదిపై రూ.346.87 కోట్లతోను, వైనతేయ, వశిష్ఠ నదుల మీద వంతెనలకు రూ.320.24 కోట్లకు టెండర్లు ఖరారై పనులు జరుగుతున్నాయి. వీటి నిర్మాణాలు పూర్తయితే మిగిలిన ప్రాజెక్టు వేగవంతం అవుతుంది. గత ఏడాది నుంచి కరోనా కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. ఇదే రీతిలో పనులు జరిగితే దీని నిర్మాణం పూర్తయ్యేందుకు మరో మూడేళ్లు పడుతుందని, అంచనాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గోదావరి జిల్లాలో విప్లవాత్మక అభివృద్ధి…

ఈ రైల్వే నిర్మాణ పనులు పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక్కడ నుంచి వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు ఉత్తరాధి రాష్ట్రాలకు ఎగుమతులు పెరుగుతున్నాయి. రోడ్డు రవాణా వల్ల ఇప్పుడవుతున్న ఖర్చుకన్నా సగం ఖర్చుతో రైల్వేతో ఎగుమతులు చేయవచ్చు. కృష్ణా, గోదావరి బేసిన్‌ (కేజీ బేసిన్‌)లో చమురు సంస్థల రవాణా కూడా పెరుగుతుంది. కోనసీమ నుంచి రోజుకు 2,500 మంది వరకు బస్సుల ద్వారా హైదరాబాద్‌ వెళుతున్నారు. ఈ లైన్‌ పూర్తయితే రైల్వే ద్వారా ప్రయాణాలు పెరుగుతాయి. వీటన్నింటికన్నా కోనసీమలో పర్యాటకానికి ఈ రైల్వేలైన్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రైల్వే నిర్మాణం పూర్తయితే కేరళ కొబ్బరి తోటల్లో సాగే విధంగా కోనసీమలో కూడా రైల్వేలేన్‌ కొబ్బరి తోటల మీదుగా సాగిపోతుంది.

Also Read : Buckingham Canal – బకింగ్‌హాం కెనాల్‌ ఆధునికీకరణ ఎప్పుడు మొదలవుతుంది..?