Idream media
Idream media
గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను తప్పబట్టకూడదు. ప్రశ్నించకూడదు. ఇలా చేస్తే కోర్టు ధిక్కారం అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మునుపెన్నడూ లేని విధంగా ప్రజల నోళ్లలో నానుతోంది. ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయమైనా హైకోర్టులో పరిణామాలు వ్యతిరేకంగా ఉంటున్నాయనే భావన ప్రస్తుతం ఏపీ ప్రజల్లో నెలకొన్నాయి. ప్రజల్లో ఈ భావన నెలకొనడానికి హైకోర్టు పని తీరే కారణమనే మాట వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన రెండు పరిణామాలను బేరీజు వేస్తూ హైకోర్టులో న్యాయమూర్తుల పని తీరుపై ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ 13 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వంలో ఏజీగా పని చేసిన దొమ్మాలపాటి శ్రీనివాస్ సహా సుప్రిం కోర్టు న్యాయమూర్తి అయిన నూతలపాటి వెంకట రమణ (ఎన్‌వీ రమణ) కుమార్తెలు ఉన్నారని వెల్లడైంది. ఉదయం ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. దొమ్మాలపాటి పిటిషన్ మేరకు సాయంత్రానికికే హైకోర్టు ఏసీబీ విచారణపై స్టే విధించింది, ఎఫ్‌ఐఆర్ బయటకు పొక్కకూడదని, మీడియా, సోషల్ మీడియాలోనూ ప్రసారం కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
మరుసటిరోజే అమరావతి భూ కుంభకోణంపై సిట్ చేస్తున్న దర్యాప్తు, మంత్రివర్గ ఉపసంఘం చర్యలపై స్టే విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనను గౌరవ హైకోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేశామని, కేంద్ర హోం శాఖ, సీబీఐ వాదనలు కూడా వినాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే వారెవరి వాదనలు వినాల్సిన పనిలేదంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం సుప్రింకు వెళ్లింది.
ఇది ఒక విషయం అయితే.. ఇక రెండో విషయం… మంగళవారం హైకోర్టు ఓ పిటిషన్‌ను విచారిస్తూ ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో జరుగుతున్న చర్చకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. చీరాలలో ఓ యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఎస్‌ఐ కొట్టాడు. బండిమీద వెళుతున్న ఆ యువకుడు కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో మరణించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, చట్ట ప్రకారం చర్యలు చేపట్టింది. అయితే యువకుడి మరణానికి పోలీసులే కారణమంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన కేసు అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ ఉమాదేవీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర రాజధానికి సంబంధించిన విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు పలు ఆధారాలను ఇప్పటికే సేకరించాయి. దర్యాప్తు ప్రారంభంలోనే ఉంది. వేల కోట్ల రూపాయల కుంభకోణమిది. రాజధాని అంటే.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. ఇలాంటి వ్యవహారంలో ఆరోపణలు బలంగా వస్తే.. జరుగుతున్న దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ఏ మాత్రం పట్టించుకోకుండా స్టే ఇచ్చారు.
ఇదే సమయంలో.. అనుకోకుండా జరిగిన ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. కానీ ఆ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం, సీబీఐలు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ హల్‌చల్ చేయడం, ప్రధాని, సీఎంలను దూషించడం పక్కనబెట్టి.. ఆతనిపై చేయి చేసుకున్నారనే అభియోగంపై పోలీసులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.