కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరిక, అధ్యక్ష పదవిని చేపట్టడం… తిరిగి ఉద్వాసనకు గురవ్వడం అంతా అనూహ్యమే. వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ పదివీకాలం ముగిసి రెండు నెలలైంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తిరిగి ఆయన్నే కొనసాగిస్తారనే వార్తలు వినిపించాయి. కన్నా సైతం మళ్లీ తనకే పగ్గాలనే ధీమాతో ఉన్నారు. కానీ, ఉరుమేలేని పిడుగులా బీజేపీ అయన్ను బాధ్యతల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారణాయణ చేసిన ఏయే తప్పలు ఆయన్ను పదవీచ్యితుడిని చేశాయో ఓసారి పరిశీలిద్దాం….
బాబుతో చెలిమి….
చడీచప్పుడు కాకుండా కన్నా లక్ష్మీనారాయణను సాగనంపడం వెనుక పలు కారణాలు బలంగా పనిచేశాయనేది సుస్పష్టం. వాటిలో చంద్రబాబుతో చెలిమి ఓ ముఖ్య కారణమంటూ బీజేపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. చంద్రబాబునాయుడు, కన్నా లక్ష్మీనారాయణలు తొలినాళ్లలో కాంగ్రెస్‌లో కలసి పనిచేశారు. అయినప్పటికీ తర్వాతి కాలంలో వీరిద్దరి మధ్య ఏమంత సఖ్యతేం లేదు. కానీ, అనూహ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు కాగానే స్వతంత్రంగా వ్యహరించకుండా చంద్రబాబు నాయుడుకి తోక పార్టీల బీజేపీని నడిపించారనే అపవాదును కన్నా లక్ష్మీనారాయణ మూటగట్టుకున్నారు. ఇది బీజేపీ అధిష్టానానికి ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది.
పనితీరు పేలవం….
బీజేపీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఏళ్లుగా మోస్తున్న వారెందరికో దక్కని అవకాశం కన్నా లక్ష్మీనారాయణకు స్వల్పకాలంలోనే దక్కింది. బలమైన కాపు సామాజికవర్గ నేత కావడం, సుదీర్ఘ రాజకీయ అనుభం ఉండటంతో బీజేపీలో చేరిన తక్కువ సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడు కాగలిగారు. అయితే అప్పట్లో రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ నేత కన్నాకు మద్దతుగా ఢిల్లీలో చక్రం తిప్పబట్టే పదవి దక్కిందనే వార్తలు వినిపించాయి. అయితే అధ్యక్షుడైన తర్వాత కన్నా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓ వైపు కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నా…రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా పార్టీని జనంలోకి తీసుకెళ్లడంలో కన్నా విఫలమయ్యారని బీజేపీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.
గ్రూపులు, ప్రత్యర్థులు
కన్నా లక్ష్మీనారాయణ పార్టీ బలోపేతానికి కృషి చేయనప్పటికీ అంతర్గతంగా గ్రూపులను ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. కొంత మందిని నెత్తిన పెట్టుకోవడం..ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారిని పక్కనపెట్టడంతో వారంతా కన్నాపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు బలమైన లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహీరావు వంటి నేతలు కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకులుగా ముద్రపడిన సంగతి తెలిసిందే. వీటన్నిటికీ తోడు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా తాజాగా గవర్నర్‌కు రాసిన లేఖ అగ్నికి ఆజ్యంపోసినట్లయింది. ఎవర్నీ సంప్రదించకుండా సొంత అభిప్రాయంతో గవర్నర్‌కు లేఖరాయడం బీజేపీ కేంద్ర నాయకత్వానికి కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణాలన్నీ కలసి కన్నా ఉద్వాసనకు దారితీసినట్లు తెలుస్తోంది.