Idream media
Idream media
ఊహించినట్లుగానే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఉత్కంఠను రేపింది. రౌండు రౌండుకూ నరాలు తెగే టెన్షన్ ను పెట్టింది. చివరకు బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును విజయం వరించింది. ఈ విజయం కోసం రఘునందన్ చేస్తున్న కృషి రోజులు.. నెలలు కాదు.. సంవత్సరాలు పైబడి కొనసాగింది. గెలిచినా.. ఓడినా ఎక్కడా ఆత్వ విశ్వాసం కోల్పోకుండా, వేరే ఆలోచన లేకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. ప్రజల్లో మమేకమయ్యాడు. పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ వచ్చాడు. అంటిపెట్టుకునుంటే ప్రజలు ఎప్పటికైనా గుర్తు పెట్టుకుంటారని రఘునందన్ గెలుపుతో రుజువైంది.
మూడో సారి ప్రయత్నం.. దుబ్బాక దాసోహం..
రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీని నియోజకవర్గంలో అంచలంచెలుగా జనాల్లోకి తీసుకెళ్లారు. అప్పటి వరకూ బీజేపీ అంటేనే చాలా దూరంగా ఉండే ప్రజలకు మెల్లిమెల్లిగా దగ్గర చేశారు. ముందుగా కార్యకర్తలను తయారు చేసుకున్నారు. కాలనీ, బస్తీలలో లీడర్లను తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాష్ట్రం కోసం ముందుండి పోరాడిన పార్టీగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ సెంటిమెంట్ లో ఓడిపోయారు. మూడో స్థానానికే పరిమితం అయ్యారు. అయినా మరో ఆలోచన లేకుండా 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో మళ్లీ నిలబడ్డారు. ఆ ఎన్నికలలో కేసీఆర్ సునామిలో వెనుకబడ్డారు. రెండు సార్లు ఓటమి పాలైన రఘునందన్ వెనుకడుగు వేయలేదు. నియోజకవర్గాన్ని వదలలేదు. తనను నమ్ముకున్న పార్టీ శ్రేణులకు అండగానే ఉన్నాడు. ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉప ఎన్నికలో బరిలో దిగి విజయం సాధించారు. ఈ సారైనా తనకు ఓట్లు వేసి గెలిపించండి.. అంటూ విన్నవించి ప్రజల ఓట్లు పొందారు. లక్ష్యం సాధించారు.
కలిసొచ్చిన వివాదాలు…
ఏ వివాదాలైతే రఘునందన్ ను వెంటాడాయే చివరకు గెలుపునకు అవి కూడా దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు, డబ్బు పంపకాలకు శ్రీకారం చుడుతున్నారంటూ వచ్చిన విమర్శలు.. అవేమీ రఘునందన్ గెలుపును అడ్డుకోలేకపోయాయి. విమర్శలను తిప్పికొట్టడంలో సఫలీకృతమయ్యారు. ఇందుకు పార్టీ లీడర్లు రంగంలోకి దిగి చేసిన కృషి ఫలించింది. ప్రధానంగా రఘునందన్ మామ ఇంట్లో డబ్బు కట్టలు దొరికిన అంశంలో రేగిన వివాదంలో రఘునందన్ పై జరిగిన దాడిని తిప్పి కొట్టేందుకు పార్టీ నాయకత్వం మొత్తం రఘునందన్ కు అండగా నిలిచింది. ఇదంతా టీఆర్ఎస్ కుట్రగా మార్చే ప్రయత్నం చేసింది. ఇదే వివాదంలో బండి సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ ఓ కార్యకర్త ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ సానుభూతి కూడా ఉప ఎన్నికపై పని చేసింది. ఇలా ఎన్నో సానుకూల అంశాలు దుబ్బాక పీఠంపై రఘునందన్ ను కూర్చోబెట్టాయి. కంగ్రాట్స్ రఘునందన్.