అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్న జేసీ, పరిటాల కుటుంబాలు ఇప్పుడు ఆప్యాయంగా దగ్గరవుతున్నాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురంలో పర్యటనకు వెళ్లగా ఈ అంశానికి అదే వేదికయింది. జిల్లా సరిహద్దులో లోకేష్‌కు స్వాగతం పలికేందుకు తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడకి చేరుకోగా అప్పటికే అక్కడ పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఆ సమయంలో ఒకరికారు ఎదురు పడగా జేసీ ప్రభాకర్ రెడ్డి కల్మషం లేకుండా శ్రీరామ్‌ను దగ్గరకు తీసుకున్నారు. శ్రీరామ్ కూడా ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ ఆలింగనం చేసుకోగా దానిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు.
ఈ సీన్ ఇప్పుడు అనంత పాలిటిక్స్‌లోనే కాక తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో కూడా హాట్‌టాఫిగా మారింది. నిజానికి ఒకప్పుడు జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, పరిటాల ఫ్యామిలీ ముందు తెలుగుదేశం పార్టీలో ఉంది. ముందు నుంచి కూడా రెండు కుటుంబాలకు అస్సలు పొసగేది కాదు. కానీ వైఎస్ మరణానంతరం రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జేసీ కుటుంబం కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరాలని ప్రయత్నాలు చేసింది. కానీ అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశం కండువా కప్పుకుంది. ఆ సమయంలో పరిటాల కుటుంబం జేసీ ఫ్యామిలీ చేరికను తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత జోక్యంతో సైలెంట్ గా ఉండక తప్పని పరిస్థితి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి శత్రువైన వైసీపీని దెబ్బతీసేందుకు జేసీ-పరిటాల కుటుంబాలు శత్రుత్వం వదిలి మిత్రులుగా మారాయని భావిస్తున్నారు. అయితే జేసీ తీరు ఎప్పుడూ అలానే ఉంటుందని, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్ పట్ల కూడా జేసీ ఇలాగే ప్రవర్తించారు. తన బస్సుల గురించి వార్తలు రాశారని ఆరోపిస్తూ టీడీపీ ప్రభుత్వ హాయంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ రెడ్డి సాక్షి ఆఫీస్ ముందుకు వెళ్లి వైఎస్ జగన్ ను అనరాని మాటలు అన్నీ అన్నారు. కానీ ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాక జగన్ నిజాయితీగా ఉన్నాడు కాబట్టే తాను గెలిచానంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం జగన్ కు కలుస్తానని ప్రకటించారు.
ఇప్పుడు కూడా అధికారంలో లేరు కాబట్టి, పైగా అనంతపురం టీడీపీలో ఒంటరి అయ్యే పరిస్థితులు ఉండడంతో పరిటాలతో కలవడానికి జేసీ సిద్ధమయ్యారు. అది కూడా ఇద్దరూ తమ ఉమ్మడి రాజకీయ శత్రువుగా భావిస్తున్న జగన్ కోసం. ఇప్పుడు దీనికి టీడీపీ శ్రేణులు ఆత్మీయ కలయిక అంటూ ప్రచారం చేస్తున్నాయి.. కానీ ఇది ఆత్మీయం కాదని.. అవసరమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read : Chandrabbu Tdp – 14 ఏళ్లు సీఎం.. ఇప్పుడు కుప్పంలో ఎక్స్ ఆఫీషియో మెంబర్!