iDreamPost
iDreamPost
గతంలో లీడర్లపై గుడ్ల దాడులు, చెప్పుల దాడులు జరగడం చూశాం… రెండేళ్ల కిందట తెలంగాణలోని అబ్దాల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై జరిగిన పెట్రోల్ దాడి సంచలనం రేపింది. ఇప్పుడు కొత్తగా ఇసుక దాడి జరిగింది. అయితే ఇది కాస్త విచిత్రమైన కథ. తన పై అధికారిపై ఓ మహిళా అధికారి దాడి చేశారు. తనతో తెచ్చుకున్న ఇసుకను ఆఫీసులో కూర్చున్న ఆఫీసర్ ముఖంపై చల్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తనపై పుష్పవర్ధన్ వేధింపులకు దిగారని శాంతి ఆరోపిస్తుంటే.. తాను విధుల్లోకి చేరి నెలరోజులే అవుతోందని, ఎవరితోనూ తనకు విభేదాలు లేవని పుష్పవర్ధన్ చెబుతున్నారు. దేవాదాయ శాఖలో కలకలం రేపిన ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అధికారులతో చర్చిస్తుండగా..
విశాఖ దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్గా పుష్పవర్ధన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఈ మధ్యే తెలంగాణ నుంచి బదిలీపై వచ్చారు. ఆయన కిందే అసిస్టెంట్ కమిషనర్ గా కె.శాంతి పని చేస్తున్నారు. గురువారం పొద్దున తన ఆఫీసులో అధికారులతో పుష్పవర్ధన్ సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శాంతి.. ఆయనపై ఇసుక చల్లారు. పుష్పవర్ధన్ పై కొద్ది సేపు అరిచారు. ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. అయితే ఆమె మట్టి చల్లి, గట్టిగా మాట్లాడుతున్నా.. పుష్పవర్ధన్ ఏం పట్టించుకోకుండా పేపర్లు చూసుకుంటూ ఉండటం అందులో కనిపించింది. పక్కనే ఉన్న అధికారులు కల్పించుకుని శాంతిని బయటికి వెళ్లమని కోరారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు పుష్పవర్ధన్ ఫిర్యాదు చేశారు.
శాంతి తీవ్ర ఆరోపణలు..
‘‘నా క్యారెక్టర్ గురించి బయట చెడుగా చెబుతున్నారు. కింది స్థాయి సిబ్బందితో నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. ఈ ఆరోపణల వల్ల నా కుటుంబసభ్యులు కూడా మనోవేదనకు గురవుతున్నారు’’ అని అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. పుష్పవర్ధన్, తనకు మధ్య ఉన్న విభేదాలపై పరిష్కరించుకునేందుకు రాజమండ్రిలోని రీజనల్ జాయింట్ కమిషనర్ వద్దకు రావాలని అధికారులు కోరినా ఆయన స్పందించలేదన్నారు. విచారణకు రాకుండా న్యాయవాదితో వస్తానని చెప్పి తప్పించుకున్నారని ఆరోపించారు. నిజంగా డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ తప్పు లేకపోతే విచారణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షలను మనసులో ఉంచుకుని వేధించాడని, మానసిక వేదన భరించలేకే అతడిపై ఇసుక చల్లాల్సి వచ్చిందని తెలిపారు.
ఎక్కడా ఇలా జరగలేదన్న పుష్పవర్ధన్..
‘‘నేను ఎన్నో చోట్ల పని చేశాను. కానీ ఎక్కడా ఇలాంటి ఘటన ఎదురుకాలేదు’’ అని డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ చెప్పారు. ‘‘నేను విధుల్లో చేరి నెల రోజులే అవుతోంది. రెండు వారాల నుంచి ఆఫీసుకు రాలేదు. శాఖాపరమైన అంశాల్లో బిజీగా ఉన్నా. గురువారమే ఆఫీసుకు వచ్చి అధికారులతో సమావేశం నిర్వహించా. వాళ్లతో చర్చిస్తుండగానే శాంతి వచ్చి ఇసుకతో దాడి చేశారు. దుర్బాషలాడారు’’ అని ఆయన వివరించారు.
కారణం అదేనా?
విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తారాస్థాయికి చేరడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికంగా అధికారుల్లో చర్చ జరుగుతోంది. శాంతి వర్గం ఉద్యోగిని డీసీ పుష్పవర్ధన్ సస్పెండ్ చేయడం.. పుష్పవర్ధన్ వర్గం ఉద్యోగిని శాంతి సస్పెండ్ చేయడంతోనే వివాదాలు తారాస్థాయికి చేరాయని చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించారని, కానీ వాళ్లు సహకరించలేదని మాట్లాడుకుంటున్నారు. రెండు వారాలుగా డీసీ పుష్పవర్ధన్ తన ఆఫీసుకు రావడం లేదు. ఆయన విశాఖ పట్నం వస్తే తగిన బుద్ధి చెబుతానని శాంతి వ్యాఖ్యానించారని, ఇందులో భాగంగానే ఇసుకతో దాడి చేశారని ప్రచారం జరుగుతోంది. ఆమె దాడి చేస్తారనే విషయం తెలిసే.. పుష్పవర్ధన్ ఆఫీసుకు రాలేదని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇసుక చిమ్మినా.. పెద్దగా రియాక్ట్ కాలేదని, ఆమె తిడుతున్నా పేపర్లు చూస్తూ ఉండిపోయారని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి.
Also Read : యనమల అప్పుల నీతి చంద్రిక