iDreamPost
android-app
ios-app

స్వర్గానికేగిన అడవి వీరుడు

  • Published Jun 02, 2021 | 5:56 AM Updated Updated Jun 02, 2021 | 5:56 AM
స్వర్గానికేగిన అడవి వీరుడు

ఎంటర్ టైన్మెంట్ ప్రపంచంలో టార్జాన్ కున్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. ఖరీదైన దుస్తులు వేసుకోకుండా కేవలం ఒక తోలు గోచి కప్పుకుని అడవిలో జంతువులతో స్నేహం చేస్తూ అల్లరి చేసే టార్జాన్ అంటే పిల్లలకే కాదు పెద్దలకూ ప్రేమ ఎక్కువ. తెలుగులోనూ చిరంజీవి అంతటి హీరో సైతం అడవిదొంగ రూపంలో ఆ వేషంలో హిట్టు కొట్టి ముచ్చట తీర్చుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ కూడా రాజపుత్ర రహస్యంలో ఈ గెటప్ లో కనిపించడం నిన్నటి తరం సినీ ప్రేమికులకు గుర్తే. అయితే ప్రపంచవ్యాప్తంగా టార్జాన్ కు ఒక గుర్తింపు, ఇమేజ్ ని తెచ్చిపెట్టింది మాత్రం జోయీ లారా. 90 దశకం మూవీ లవర్స్ ఇతన్ని మర్చిపోలేరు.

ఈ జోయీ లారా నిన్న జరిగిన ఓ విమాన ప్రమాదంలో కన్ను మూశారు. అతని భార్య మరో ఐదుగురు బృందసభ్యులు కూడా మృత్యు వాత పడ్డారు. నాష్ విల్లి నగరం వద్ద ఉన్న ఒక చిన్న సరస్సు వద్ద వీళ్ళు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ కుప్పకూలడంతో అందరూ స్పాట్ లోనే చనిపోయారు. లారా 1962 అక్టోబర్ 2వ తేదీ సాన్ డియెగోలో జన్మించారు. 1988లో వచ్చిన నైట్ వార్స్ అనే మూవీలో అమెరికా సైనికుడిగా ఓ చిన్న పాత్ర వేశారు. 1989లో వచ్చిన సూపర్ హిట్ టీవీ సిరీస్ టార్జాన్ ఇన్ మన్ హటన్ తో ఇతను వెలుగులోకి వచ్చాడు. అది బ్లాక్ బస్టర్ కావడంతో జోయీ లారా పేరు మారుమ్రోగిపోయింది.

దీని తర్వాత గన్ స్మోక్ ది లాస్ట్ అపాచే, డెంజర్ ఐలాండ్ అనే మరో రెండు సినిమాల్లో నటించారు. 1996లో తిరిగి టార్జాన్ ది ఎపిక్ అడ్వెంచర్స్ ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇలా కెరీర్ కొనసాగుతుండగానే 2002లో హఠాత్తుగా జోయీ లారా నటనకు స్వస్తి చెప్పి కంట్రీ మ్యూజిక్ వైపు వెళ్లిపోయారు. 2018లో రచయిత్రి గ్వేన్ సాంబ్లిన్ ని పెళ్లి చేసుకున్న లారా ఆమెకు మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు పిల్లల బాధ్యతలను కూడా తనే తీసుకున్నాడు. సెస్నా సి 501 అనే చిన్న విమానం టార్జాన్ ప్రపంచానికి దూరమవ్వడానికి కారణం అయ్యింది. ఊహించని ఈ షాక్ తిన్న అభిమానులు  అతనికి తుది నివాళులు అర్పించారు