తెలంగాణలోని జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి రంకెలు వేస్తోంది. రాష్ట్రం మొత్తం 13,500 కేసులు ఉంటే.. సుమారు 9000 వరకూ ఒక్క మహానగరంలోనే ఉన్నాయి. దీంతో జనం భయం బ్రాంతులకు గురి అవుతున్నారు. దీంతో సర్కారు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ విధించడంపై విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని, దీనిపై ఆలోచిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఎక్కువ కేసులు వచ్చినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని ఆయన అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది బెడ్లు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోందని వెల్లడించారు.
మరణాలు తక్కువే : ఈటల
ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. రాష్ట్రంలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కవగా ఉందని అన్నారు. దేశంలో కరోనాతో చనిపోయిన వారి జాతీయ సగటు 3.04 శాతంగా ఉంటే.. తెలంగాణలో అది కేవలం 1.52 శాతంగా ఉందని వివరించారు. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వివరించారు.
ఇప్పటికే కరోనా తీవ్రత దృష్ట్యా గ్రేటర్ పరిధిలోని చాలా మంది వ్యాపారులు స్వచ్చంధ లాక్ డౌన్ కు పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ లో ప్రముఖ బజారులన్నీ మూత పడ్డాయి. సికింద్రాబాద్ జనరల్ బజార్, చార్మినార్ లాడ్ బజార్, పాట్ మన్డి గోల్డ్ బజార్… ఇలా ప్రముఖ వ్యాపార సముదాయాలు అన్నీ స్వచ్చందంగా మూత పడ్డాయి. తాజాగా హైదరాబాద్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ దుకాణాల్లో పని చేసే సిబ్బందికి కరోనా సోకుతుండడంతో దుకాణాలను ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించింది. జూలై 17 వరకూ ఇలాగే కొనసాగిస్తామని దుకాణాల ప్రతినిధులు చెబుతున్నారు.