iDreamPost
android-app
ios-app

ఇకపై వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు

ఇకపై వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతికి రెండు రోజుల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు వైఎస్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా రైతు భరోసా కేంద్రాల పేరుకు వైఎస్సార్‌ పేరును చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతు భరోసా కేంద్రాలను వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పంట రుణాలు,ఇన్య్సూరెన్స్‌ తదితరాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అందిస్తున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ చరిత్రలోనే రైతులకు మేలు చేసిన నేతల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఇప్పటి వరకూ వైఎస్సార్‌ నిలిచారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యే ముందు దాదాపు 1600 కిలోమీటర్ల మేర వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. రైతులు, వృద్ధులు, పేద, మధ్య తరగతి ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు. ప్రజా ప్రస్థానంలో రైతన్న కష్టాలు చూసిన వైఎస్సార్‌ అప్పటి వరకూ దేశ చరిత్రలో లేని వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అనే పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలా ఇస్తే కరెంట్‌ తీగలపై విద్యుత్‌ ప్రవహించదని, వాటిపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనంటూ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యంగ్యోక్తులు విసిరారు. అఖండ విజయంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన క్షణంలోనే హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్‌ స్టేడియంలో అశేష జనవాహిన సాక్షి వైఎస్‌ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేసి రైతన్నల బతుకు చిత్రాన్ని మార్చివేశారు.

అప్పటి వరకూ 9 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వ కాలంలో కరువుతో పంటలు సరిగా పండక, వేసిన పంట మధ్యలోనే ఎండిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న రైతన్నకు కరెంట్‌ చార్జిలు గుదిబండగా మారాయి. బిల్లుల కట్టాలని అధికారులు రైతన్నలపై ఒత్తిడి తెచ్చేవారు. కట్టని వారి మోటార్లకు ఉన్న విద్యుత్‌ మీటర్లు, కేబుల్‌ తీసుకెళ్లేవారు. విద్యుత్‌ అధికారులు కరుడుగట్టిన వడ్డీ వ్యాపారుల్లా ప్రవర్తించేవారు. కరెంట్‌ చార్జీలు తగ్గించాలని బషీర్‌బాగ్‌ వద్ద ధర్నా చేసిన రైతులపై చంద్రబాబు పోలీసు కాల్పులు జరిపించారు. చంద్రబాబు పాలనలో అన్నదాతకు కష్టాలే తప్పా ఒరిగింది ఏమీ లేదు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ రాష్ట్రంలోని రైతుల చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇలాంటి పరిస్తితి నుంచి వ్యవసాయాన్ని పండగ చేసేలా వైఎస్సార్‌ పాలన సాగింది. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటే అదంతా వైఎస్సార్‌ చలువే. అందుకే వైఎస్సార్‌ ఈ భువిపై లేకపోయినా రైతుల గుండెల్లో ఉన్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు.