Idream media
Idream media
వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యున్నతంగా అందించాలన్నదే జగన్ సర్కర్ లక్ష్యంగా ఉన్నట్లు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తోంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందే విషయంలో ఎక్కడా ఎలాంటి అడ్డంకులు, ఆలస్యం ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.
ప్రభుత్వ పాలనను.. పల్లె ముంగిటకు తీసుకెళ్లేలా గత ఏడాది ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాటికి అనుబంధంగా వ్యవసాయం, పాడి రంగాల రైతులకు అండగా ఉండేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)ను ఈ ఏడాది జూన్ ప్రారంభంలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రైతన్నలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంట బీమా, పాడి రైతులకు కావాల్సిన పశువుల ధాణా, గడ్డి విత్తనాలు, పశువైద్యం.. తదితర అన్ని సేవలను ఆర్‌బీకేఈల ద్వారా అందిస్తున్నారు.
ఒక పంచాయతీ పరిధిలోని రెండు లేదా మూడు గ్రామాలకు కలిపి ఒక గ్రామ సచివాలయం, దానికి అనుబంధంగా ఆర్‌బీకే ఉంది. ఈ క్రమంలో ఆర్‌బీకేలలో అందుబాటులో ఉన్న సేవలు, ఉత్పత్తుల సమాచారం తెలుసుకునేందుకు రైతన్నలు గ్రామ సచివాలయానికి రావడమో లేదా తమ పరిధిలోని వాలంటీర్‌ను సంప్రదించడమో ఇప్పటి వరకూ చేస్తున్నారు. ఆర్‌బీకేకు రైతుల మధ్య సమాచార ప్రసార లోపం ఎదురవుతోంది. దీన్ని నివారించేందుకు వైసీపీ సర్కార్ మరో వినూత్న ఆలోచన చేసింది. సోషల్ మీడియాను సమాచార వేదికగా వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఆర్‌బీకే పరిధిలోని రైతులందరి ఫోన్ నంబర్లతో ఆ పంచాయతీ పేరుపై ‘రైతు భరోసా కేంద్రం’ అనే వాట్స్ అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుడు, పశువైద్య సహాయకుడుతో పాటు గ్రామ సచివాలయం పరిధిలోని వాలంటీర్లందరూ సభ్యులుగా ఉన్నారు. ఆర్‌బీకేలలో ఎప్పటికప్పడు లభించే సేవలు, అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బీమా, ఈ క్రాఫ్.. తదితర సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఆ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. ఫలితంగా రైతులకు ఆర్‌బీకేలలో లభించే సేవల సమాచారం తమ అరచేతిలో ఉంటోంది. దీని వల్ల ఎక్కడా సమాచార ప్రసార లోపం లేకుండా రైతులకు వేగంతో కూడిన అత్యున్నత సేవలు ఆర్‌బీకేల ద్వారా లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: ‘పోస్టు’ చేస్తున్నారా.. జర జాగ్రత్త