iDreamPost
android-app
ios-app

ఇంధ‌న ధ‌ర‌ల ద‌డ‌.. ధరలు తగ్గించమంటున్న ఆర్బీఐ

ఇంధ‌న ధ‌ర‌ల ద‌డ‌.. ధరలు తగ్గించమంటున్న ఆర్బీఐ

పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 15 సార్లు ధరలు పెరగడం గమనార్హం. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కూ అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. పెట్రోల్, డీజిల్‌పై పరోక్ష పన్నులు తగ్గించాలని ఆయ‌న‌ పిలుపు ఇచ్చారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై వ్యయపరంగా ఒత్తిడిలు మరింత పెరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు స్పందించాయి. స్వల్పంగా పన్నులను సడలించాయి.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా విస్మ‌యం వ్య‌క్తం చేసింది. ఇందన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. ఇందులోభాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పరోక్ష పన్నులను తగ్గించవచ్చని అభిప్రాయపడింది. బాంబే ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌(బీసీసీ) 185వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతోన్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవం. కరోనా అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆదాయం, ప్రభుత్వ ఖర్చులను కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, వీటిని తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు.

గత కొంతకాలంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, ఇంధన ధరల వల్ల రానున్న రోజుల్లో తయారీ, ఉత్పత్తి రంగంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. గడిచిన పది రోజులుగా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని.. కొన్ని రాష్ట్రాల్లో లీటరు రూ.100కు చేరువయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంధనంపై భారీగా ఉన్న పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ చర్యలతో వీటి ధరలను అదుపులోకి తేవచ్చని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, శ‌క్తి కాంత దాస్ వ్యాఖ్య‌ల‌తో కేంద్ర‌, రాష్ట్ర ప‌న్నుల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. రిటైల్‌ అమ్మకపు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్‌పై 60శాతంపైగా, డీజిల్‌పై 56 శాతం పన్నుల భారం విధిస్తున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా, లాక్డౌన్ వల్ల దేశంమొత్తం స్తంభించిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో పెట్రోల్, డీజిల్ వినియోగం సగానికి పైగా తగ్గిపోయింది. లాక్డౌన్ దెబ్బకు అంతర్జాతీయ చమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దాంతో వ్యాట్, ఎక్సైజ్ సుంకం రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం గ‌తేడాది మే లోనే పెంచింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 1.6 లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది.

హైదరాబాద్‌లో ప్ర‌స్తుతం లీటరు పెట్రోల్‌ రూ.94.18, డీజిల్‌ ధర రూ.88.31గా ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను సుమారుగా పెట్రోల్‌పై రూ. 34.98, డీజిల్‌పై రూ.33.83. అంటే పెట్రోల్‌, డీజిల్‌ కొన్నప్పుడు 40 శాతం డబ్బును నేరుగా సామాన్యుల జేబుల్లో నుంచి కేంద్రం తీసుకుంటున్నదన్నమాట. 2014 జూన్‌లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉండేది. అప్పుడు చమురు బ్యారెల్‌ ధర 109 డాలర్లు.

అప్పట్లో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.71, డీజిల్‌ రూ.59గా ఉండేది. ఇప్పుడు చమురు ధర 40 డాలర్లకు పడిపోయింది. ఈ లెక్కన పెట్రోల్‌ రూ.35కు, డీజిల్‌ రూ.30కి లభించాలి. కానీ అంతకు రెండున్నర రెట్లు ధర ఎక్కు వగా ఉన్నది. దీనికి ప్రధాన కారణం కేంద్రం అడ్డగోలు వ‌సూళ్లే కార‌ణ‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. 2014తో పోల్చితే కేంద్ర ప్రభుత్వ పన్ను లు పెట్రోల్‌పై మూడు రెట్లు పెరిగాయి. బీజేపీ ప్రభు త్వం ఎక్సైజ్‌ సుంకాన్ని గడిచిన ఆరేండ్లలో ఏకంగా 15 సార్లు సవరించిన‌ట్లు తెలుస్తోంది.

ప్రైవేట్‌ రంగం చేతుల్లోకి చమురు పరిశ్రమ

పెట్రోలియం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) లదే ప్రధాన వాటా. పెట్రోలియం మార్కెట్‌లో ఐవోసీకి 45 శాతం, బీపీసీఎల్‌కు 24 శాతం, హెచ్‌పీసీఎల్‌కు 22 శాతం వాటా ఉన్నది. అంటే మూడొంతుల మార్కెట్‌ ఈ మూడు సంస్థల వద్దే ఉన్నది. క్షేత్రస్థాయిలో ఐవోసీకి దేశవ్యాప్తంగా 35 వేలకుపైగా ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. సుమారు 5.5 కోట్ల ఇండ్లకు నేరుగా పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా చేస్తున్నది. బీపీసీఎల్‌ వద్ద రూ.2 లక్షల కోట్లకుపైగా స్థిరాస్థులు, రూ.35 వేల కోట్ల రిజర్వ్‌ నిధులు ఉన్నాయి. ఏటా రూ.8 వేల కోట్ల లాభాన్ని ఆర్జిస్తున్నది. దేశవ్యాప్తంగా 15 వేల పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్‌ సైతం 15 వేలకుపైగా పెట్రోల్‌ బంక్‌లను నిర్వహిస్తున్నది. ఇవన్నీ లాభాల్లో నడుస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి ఈ మూడు సంస్థలు కలిపి ఏటా సుమారు రూ.4 లక్షల కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లిస్తున్నట్టు అంచనా. మోదీ ప్రభుత్వం 2017 నుంచి వీటి ప్రైవేటీకరణను చేపట్టింది. దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ పెట్రోల్‌ శుద్ధి, గ్యాస్‌ వెలికితీత, సరఫరా వంటి వ్యవస్థలను అప్పగిస్తున్నది. త్వరలో పెట్రోల్‌ బంక్‌లను సైతం అప్పజెప్పేందుకు సిద్ధమవుతున్నది. ఇదే జరిగితే దేశంలో ఇంధన ధరలను ప్రైవేట్‌ సంస్థలే శాసిస్తాయని, ధర రెట్టింపైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు.