iDreamPost
android-app
ios-app

కోడెల పాత స్థానం రాయపాటికి కావాలంట…

  • Published Sep 15, 2021 | 2:57 PM Updated Updated Sep 15, 2021 | 2:57 PM
కోడెల పాత స్థానం రాయపాటికి  కావాలంట…

గడిచిన రెండున్నరేళ్ళుగా ప్రచారానికి దూరంగా ఉన్న సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మరోసారి తెరమీదకు వచ్చారు. టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. ఏపీలో తమ పార్టీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నాలు చేయడం ఆసక్తికరం అవుతోంది.

రాయపాటి సాంబశివరావు మొన్నటి సాధారణ ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్సీపీ తరుపున శ్రీకృష్ణదేవరాయులు విజయం సాధించారు. అప్పటి నుంచి యువకుడిగా శ్రీకృష్ణదేవరాయులు ఉత్సాహంగా నియోజకవర్గంలో తిరుగుతుండగా, రాయపాటి మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. పైగా వివిధ సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించని నేపథ్యంలో ఆర్థిక నేరాల కేసులు కూడా ఆయన్ని వెంటాడాయి. ట్రాన్స్ ట్రాయ్ పేరుతో చేసిన ఆర్థిక అక్రమాలపై సీబీఐ కన్నేసింది. ఈ నేపథ్యంలో కాస్త దూకుడు తగ్గించిన రాయపాటి ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా చంద్రబాబుతో భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అదే సమయంలో తమకు సత్తెనపల్లి సీటు ఇవ్వాల్సిందేనని ఆయన అధినేతకు అల్టిమేటం జారీ చేయడం గుంటూరులో కాక రేపుతోంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి గతంలో దివంగత కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత మరణించడంతో టీడీపీకి అక్కడి సమర్థుడైన నాయకుడు కరువయ్యారు. ఇటీవల కోడెల తనయుడు శివరామ్ మాత్రం సత్తెనపల్లి మీద గంపెడాశతో ఉన్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా తన తండ్రి వారసత్వం తనకు వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఈలోగా రాయపాటి సీన్ లోకి రావడంతో టీడీపీ వ్యవహారం వేడెక్కుతోంది. సత్తెనపల్లి తనదేనని శివరామ్ అంచనాతో ఉన్న తరుణంలో రాయపాటి తన కుటుంబానికి ఇవ్వాల్సిందేనంటూ అధినేతకు స్పష్టం చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

రాయపాటి కోడలు ఇటీవల అమరావతి ఉద్యమంలో ముందుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీచేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు పలువురు భావిస్తున్నారు. రమేష్ హాస్పిటల్ నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఆమె వైద్యురాలు కావడంతో అవకాశాలు వస్తాయనే అభిప్రాయం రాయపాటి వర్గీయుల్లో ఉంది. దానికి తగ్గట్టుగా సత్తెనపల్లి సీటు మీద ఖర్చీఫ్ వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అటు రాయపాటి, ఇటు కోడెల వర్గాల్లో కొత్త కాక రాజేందుకు దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు.