iDreamPost
android-app
ios-app

రాయ‌దుర్గం KB ప్యాలెస్

రాయ‌దుర్గం KB ప్యాలెస్

థియేట‌ర్ అంటే నా దృష్టిలో మంత్రాల పెట్టె. యుద్ధాలు చూపిస్తుంది, పాట‌లు పాడుతుంది, న‌వ్విస్తుంది. ఏడిపిస్తుంది. చిన్న‌ప్పుడు అమాయ‌క‌పు రోజుల్లో థియేట‌ర్లో ప‌నిచేసే వాళ్ల‌ను చూసి కుళ్లుకునే వాన్ని. రోజంతా సినిమాలు చూసేవాళ్లు ఎంత అదృష్ట‌వంతులు. సినిమా చూడ‌డ‌మే ఉద్యోగం అంటే , దానికి మించింది ఏముంది? ఇంట‌ర్మీడియ‌ట్‌లో లెక్క‌లు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ పీడ‌క‌ల‌గా వెంటాడుతున్న రోజుల్లో అనంత‌పురం త్రివేణి టాకీస్‌లో ఆప‌రేట‌ర్‌గా చేరిపోదామ‌నుకున్నా. ఆ ద‌రిద్ర‌పు రోజుల్లో దానికి కూడా ఎవ‌రో పోటీ వ‌చ్చి ర‌క్షించారు.

రాయదుర్గంలో KB పిక్చ‌ర్ ప్యాలెస్ నా క‌ల‌ల సౌధం. మొద‌టిసారి సినిమా చూపించింది. బాల‌ప్ప అనే పెద్దాయ‌న ఎపుడో నేను పుట్ట‌క ముందు క‌ట్టాడు. ఆయ‌న మ‌నుమ‌డు బాల‌ప్ప ఇపుడు దాని య‌జ‌మాని. కాన్వెంట్‌లు లేని కాలంలో ఈ బాల‌ప్ప నా క్లాస్‌మేట్‌. థియేట‌ర్ య‌జ‌మాని కొడుకు కావ‌డం వ‌ల్ల , వీడంటే నాకు జెల‌సీ. జేబులో సినిమా రీల్ పెట్టుకుని స్కూల్‌కి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఊరించే వాడు. బాగా కాకాప‌ట్టి “బాలూ బాలూ” అని పీచుమిఠాయి కొనిపెడితే ఒక నాలుగు పిక్చ‌ర్ ముక్క‌లు చేతిలో పెట్టేవాడు.

ఓన‌ర్ కాబ‌ట్టి వీడి క్లాస్ ఎప్పుడూ బాల్క‌నీ. మ‌న‌ది నేల‌, బెంచీ. బాల్క‌నీ నుంచి మ‌మ్మ‌ల్ని చూసి న‌వ్వేవాడు. చూడ‌కుండా ఉందామ‌ని Try చేసినా చ‌ప్ప‌ట్లు కొట్టి పిలిచి మ‌రీ న‌వ్వేవాడు. ఈ పాత క‌క్ష‌లు లోప‌ల ఉండ‌డం వ‌ల్ల క్లాస్‌లో వీడితో భీక‌ర యుద్ధాలు జ‌రిగేవి.

రెండో త‌ర‌గ‌తిలో ఒక‌సారి యుద్ధం శ్రుతి మించింది. వాడు వెళ్లి వాళ్ల అవ్వ‌ను తీసుకొచ్చాడు. నాకూ ఒక అవ్వ ఉంది. ఇద్ద‌రు అవ్వ‌లు మ‌నుమ‌ళ్ల ప‌క్షానా యుద్ధం చేస్తూ ఉంటే అయ్య‌వార్లు విడిపించారు. వాళ్లు యుద్ధం చేస్తూ ఉండ‌గా వాన వ‌స్తే, టాల్‌స్టాయ్ క‌థ‌లోలా నేనూ, బాలూ ఇసుక‌లో గుళ్లు క‌ట్టుకున్నాం.

ప్రొజెక్ట‌ర్ రూమ్‌లో నుంచి సినిమా చూడాల‌ని నా కోరిక‌. అది తీర‌డానికి చాలా ఏళ్లు Wait చేయాల్సి వ‌చ్చింది. ప్యాలెస్‌లో ఆచారి అనే ఆప‌రేట‌ర్ ఉండేవాడు. ఆయ‌నే ఆ ఊళ్లో తొలి ఆప‌రేట‌ర్‌. ఒక క‌న్ను లేక‌పోవ‌డంతో గుడ్డి ఆచారి అని పిలిచేవాళ్లు. క‌రెంట్ పోయినా, రీల్ క‌ట్ అయినా ప్రేక్ష‌కులు “అరే గుడ్డి ఆచారీ నీయ‌మ్మ‌య‌క్క” అని తిట్టేవాళ్లు. అజీజియా అని ఇంకో థియేట‌ర్ ఉండేది, అక్క‌డ క‌రెంట్ పోయినా ఆచారీనే తిట్టేవాళ్లు.

నేను 8వ త‌ర‌గ‌తిలో ఉండ‌గా ఈ ఆచారీతో ఫ్రెండ్‌షిప్ ఏర్ప‌డింది. ఒక రోజు క్యాబిన్‌లో సినిమా చూపించ‌మ‌ని అడిగితే సరే అన్నాడు. లోప‌లికి ప్ర‌వేశించ రాదు అని బోర్డు ఉన్నా క్యాబిన్‌లోకి తొలిసారి అడుగు పెట్టాను.

అప్ప‌టికే సినిమా స్టార్ట్ అయింది. ANR బంగారు క‌ల‌లు. ప్రొజెక్ట‌ర్ గిర్రున తిరిగే Sound, మంత్ర‌న‌గ‌రి క‌వాటాలు తెరుచుకుంటున్న‌ట్టుంది. క‌న్నంలో త‌ల పెడితే దూరంగా స్క్రీన్ మీద బొమ్మ క‌నిపించింది. చీక‌టి వెలుగులు క్యాబిన్ రూమ్‌లో మెరుస్తున్నాయి. చీక‌ట్లో ఒక ర‌క‌మైన వాస‌న‌. రీలు చుట్టుని రాట్నంలాంటి దానికి అమ‌ర్చి ఆచారి చేత్తో తిప్పాడు. గిరాగిరా తిరిగింది. దార‌పు కండెలా సినిమా అలా జారుతోంది.

కాసేప‌టి త‌ర్వాత వ‌చ్చేశాను. ఇదంతా జ‌రిగి 40 ఏళ్లు దాటింది. ఆచారి లేడు. బాలు పెద్దాడై పోయి మ‌నుమ‌ళ్లు, మ‌నుమ‌రాళ్ల‌తో ఆడుకుంటున్నాడు. ఈ రోజు బాలు పుట్టిన రోజు. (పై ఫొటోలో ఉన్న‌ది బాలూనే)

సినిమా పిచ్చి ఇంకా న‌న్ను వ‌ద‌ల్లేదు. బ‌హుశా వ‌ద‌ల‌దు కూడా.