iDreamPost
android-app
ios-app

రవి ప్రకాష్ మరో ప్రయోగంచేస్తున్నారా?

  • Published Sep 01, 2020 | 5:11 AM Updated Updated Sep 01, 2020 | 5:11 AM
రవి ప్రకాష్ మరో ప్రయోగంచేస్తున్నారా?

ఏపీ మీడియాలో మరో కొత్త ప్రయోగం తెరమీదకు వస్తోంది. హ్యాష్‌ ట్యాగ్ యూ(HashtagU) పేరుతో ప్రచారం ప్రారంభమయ్యింది. గతంలో రవిప్రకాష్‌ టీమ్ లో పనిచేసిన వారంతా దానిని ట్రెండింగ్ చేసే ప్రయత్నం చేస్తుండడం విశేషం .

చాలా కాలంగా సొంత చానెల్ తో రీ ఎంట్రీ కోసం రవి ప్రకాష్‌ ప్రయత్నిస్తున్నారు. కానీ పరిస్థితులు కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. హ్యాష్‌ ట్యాగ్ యూ పేరుతో రవిప్రకాష్ కొత్త ఛానల్ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది . కానీ వాస్తవానికి హ్యాష్‌ ట్యాగ్ యూ తో రవి ప్రకాష్ కు సంబంధం లేదని ,హ్యాష్‌ ట్యాగ్ యూ అనేది దినేష్ ఆకుల ప్రారంభిస్తున్న న్యూస్ యాప్ అని తెలుస్తుంది. ఇటీవల న్యూస్ యాప్ లకు మంచి ఆదరణ వస్తున్న తరుణంలో మీడియాలో విశేష అనుభవం ఉన్న దినేష్ ఆకుల దీని మీద దృష్టి పెట్టినట్లున్నారు.

గతంలో టీవీ9 లో రవి ప్రకాష్ టీమ్ లో దినేష్ ఆకుల పనిచేశారు. అంతకుముందు హిందీ మీడియాలో సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. స్టార్ నెట్ వర్క్ లో కీలక పాత్ర పోషించారు. ఏబీపీ న్యూస్ లో పనిచేశారు.

చత్తీస్ ఘడ్ కి చెందిన దినేష్ ఆకుల ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ అనూహ్యంగా తెలుగు మీడియాలోకి వచ్చారు. మొదట టీవీ9,ఆ తరువాత టీవీ5లో పనిచేశారు .TV9 సంస్థ కన్నడ చానెల్ ప్రారంభించిన సమయంలో ఆ వ్యవహారాలన్నీ స్వయంగా పర్యవేక్షించారు. కొద్ది కాలానికే ఆయన టీవీ5 ని కూడా వీడి ప్రస్తుతం ఢిల్లీలో ఓ సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్నారు.

ఇప్పుడు మళ్లీ హ్యాష్‌ ట్యాగ్ యూ పేరుతో ఆయన తెరమీదకు వస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మీడియాలోని ఆయన మిత్రులంతా దాని ప్రమోషన్ పని ప్రారంబించారు. దాంతో దినేష్ ఆకుల ప్రయత్నం ఎలా ఉండబోతోందనే ఆసక్తి మొదలయ్యింది. సుదీర్ఘకాలంగా మీడియా రంగంలో ఉండి, ప్రజల అభిరుచులను ఒడిసపట్టుకోవడంలో సిద్ధహస్తుడిగా గుర్తింపు ఉన్న దినేష్ కి ఈ ప్రయత్నం సత్ఫలితాలనిస్తుందని ఆయన మిత్రబృందం భావిస్తోంది. అయితే ప్రస్తుతమున్న మార్కెట్ పోటీలో అది ఏమేరకు సాధ్యమన్నది చూడాల్సిన అంశం.