iDreamPost
iDreamPost
మాములుగానే మన వాళ్లకు బాలీవుడ్ అంటే మహా మోజు. అక్కడ ఎలాగైనా జెండా పాతాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. చిరంజీవితో మొదలుపెట్టి ప్రభాస్ దాకా, రాఘవేంద్రరావు నుంచి సందీప్ రెడ్డి దాకా అందరూ హిందీలో సినిమాలు చేసినవాళ్ళే. కానీ బలమైన ప్రభావం చూపించింది మాత్రం తక్కువ. ఏదో ఉన్నంతలో కొన్ని మూవీస్ చేశామా వచ్చామా అన్నట్టుగా ఉంటుందే తప్ప ప్రత్యేకంగా ఫాలోయింగ్ అంటూ ఏర్పడదు. ఒక్క ప్రభాస్ మాత్రమే దీనికి మినహాయింపుగా నిలిచి బాహుబలి పుణ్యమాని నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోయిన్లు కూడా అక్కడికే టార్గెట్ చేసుకుంటున్నారు.
తాజాగా రష్మిక మందన్న ఓ భారీ బడ్జెట్ హిందీ చిత్రంలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు నిన్న అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్నులో నటిస్తున్నట్టు అఫీషియల్ గా చెప్పేశారు. నిజానికి రష్మికకు ఇక్కడ అవకాశాలకు లోటు లేదు. స్టార్ హీరోలవి క్యూ కట్టాయి. ఈ ఏడాది ఇంత విషమ పరిస్థితిలోనూ సరిలేరు నీకెవ్వరు, భీష్మ రెండూ బ్లాక్ బస్టర్స్ ఖాతాలో ఉన్న హీరోయిన్ తనొక్కటే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పలో బిజీగా ఉంది. ఇది కాకుండా జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో సినిమాకు తన పేరే సీరియస్ గా పరిశీలనలో ఉందట. వస్తే నో ఎందుకు చెబుతుంది.
అయితే గతంలో కాజల్ అగర్వాల్, తమన్నా, ఇలియానా, త్రిష లాంటి టాప్ బ్యూటీస్ అందరూ హిందీలో చేసినవాళ్ళే. స్టార్ హీరోల సరసన ఆడి పాడారు. కానీ రష్మిక మందన్న చేస్తోంది మీడియం రేంజ్ హీరోతో. సిద్దార్థ్ కి అంత పెద్ద మార్కెట్ ఏమి లేదు. కంటెంట్ ని నమ్ముకుని మార్కెటింగ్ చేయాల్సిందే తప్పించి మరీ గొప్పగా ఫ్యాన్స్ కూడా లేరు. అలాంటిది రష్మిక తనకు ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా చిన్న మెట్లతో పెద్ద అడుగులు వేయాలని ప్లాన్ లో ఉంది కాబోలు. సల్మాన్, అమీర్ రేంజ్ స్టార్లతో నటిస్తే తప్ప సౌత్ భామలను నార్త్ లో అంతగా గుర్తించరు. మరి తన మనసులో ఏముందో.