ప్రస్తుతం సెలెబ్రెటీలు కనబడగానే సెల్ఫీల కోసం ఎగబడతున్నారు కానీ గతంలో మొబైల్ ఫోన్ రాకముందు సెలెబ్రెటీల ఆటోగ్రాఫ్‌ల కోసం ప్రజలు ఎగబడేవారు. ఇప్పుడు సెల్ఫీలకి ఉన్న క్రేజ్ అప్పట్లో ఆటోగ్రాఫ్‌లకి ఉండేది. వి.వి.ఎస్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్ నుండి టీమిండియా తరపున ఆడి ఎన్నో రికార్డులు నెలకొల్పిన లక్ష్మణ్ కు అభిమానులు కూడా ఎక్కువగా ఉండేవారు. లక్ష్మణ్ ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎదురుచూసేవారు. అలా లక్ష్మణ్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న ఆ బాలుడిని ఎవరో గుర్తు పట్టారా ? హైదరాబాద్ రంజీ జట్టు మాజీ ఓపెనర్ అబ్దుల్ అజీమ్ దగ్గర ఈ ఫొటో ఉండగా ఆ ఫోటోని ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు. సి. వెంకటేష్ పోస్ట్ చూసిన పలువురి ఆ బాలుడు ఎవరై ఉంటారా అని మెదడుకు పదును పెడుతున్నారు.వివిఎస్ లక్ష్మణ్ తర్వాత టీం ఇండియాలో చోటు సంపాదించి అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడిగా యువ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ పేరు సంపాదించాడు. ఒకసారి మహమ్మద్ సిరాజ్ జీవితాన్ని పరిశీలిస్తే..
గల్లీ బౌలర్ నుండి టీమిండియా కీలక సభ్యుడిగా
మహమ్మద్ సిరాజ్.. ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లలో మహమ్మద్ సిరాజ్ ఒకరు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు సాధించి ఆస్ట్రేలియా వెన్ను విరిచిన సిరాజ్ చరిత్రాత్మక విజయం సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో మహమ్మద్ సిరాజ్ పేరు మారుమ్రోగిపోయింది. సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా తండ్రి మరణించినా సరే అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. బీసీసీఐ అంత్యక్రియలకు వెళ్లి రమ్మని పర్మిషన్ ఇచ్చినా తను టెస్ట్ సిరీస్ ఆడటం తన తండ్రి కల అని అక్కడే ఉండిపోయాడు. వికెట్ తీసిన ప్రతీసారి తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆకాశం వైపు చూస్తున్న సిరాజ్ ని చూసి భావోద్వేగానికి గురికాని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు..
మహమ్మద్ సిరాజ్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి మహమ్మద్ గౌస్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సిరాజ్ కి మొదటినుండి చదువుపై కంటే క్రికెట్ పైనే మక్కువ ఎక్కువగా ఉండేది. చిన్నతనం నుండి టెన్నిస్ బాల్ తోనే క్రికెట్ ఆడిన సిరాజ్ హైదరాబాద్ లో ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరిగినా అందులో ఆడటానికి వెళ్ళేవాడు. క్రికెట్ లో ఎవరి దగ్గరా కోచింగ్ తీసుకోని సిరాజ్ గల్లీ క్రికెట్ ఆడుతూ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని నవంబర్ 15, 2015 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం సంపాదించాడు. హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన సిరాజ్ 41 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ తరపున ఎక్కువ వికెట్లను సాధించిన బౌలర్ గా నిలిచాడు.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ టీం హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఆర్సీబి టీం కి నెట్ బౌలర్ గా సిరాజ్ ఎంపికయ్యాడు. ఆ సమయంలో టీం ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కంటపడటంతో సిరాజ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. భరత్ అరుణ్ ఇచ్చిన సూచనలతో సిరాజ్ బౌలింగ్ ని మెరుగుపరచుకున్నాడు. అనంతరం జరిగిన ఐపీఎల్ వేలంలో 20 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న సిరాజ్ ను రికార్డు స్థాయిలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. అనంతరం న్యూజిలాండ్ తో జరిగిన t20 సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ వికెట్ సాధించినా పరుగులు ధారాళంగా సమర్పించుకోవడంతో టీం ఇండియా జట్టులో చోటు కోల్పోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు మహమ్మద్ సిరాజ్ ను 2018 ఐపీఎల్ వేలంలో చేజిక్కుంచుకుంది. అప్పటినుంచి ఐపీఎల్ లో బెంగుళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
2020లో దుబాయ్ లో కోల్ కత టీంతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు వేసి రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచులో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్ కి ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే తండ్రి అనారోగ్యంతో మరణించడంతో జట్టు సభ్యులు సిరాజ్ కు ధైర్యం చెప్పారు. తండ్రి అంత్యక్రియలకు హాజరు కాకుండా టెస్టు క్రికెట్ జట్టులో తనని చూడాలన్న తండ్రి కోరికను నిజం చేయడానికి ఆస్ట్రేలియాలో ఉండాలని నిర్ణయించుకున్న సిరాజ్ కు జట్టులో సీనియర్ బౌలర్లు గాయాలబారిన పడటంతో బాక్సింగ్ డే టెస్టులో ఆడే అవకాశం వచ్చింది.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ టీం ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్ గా మారి ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియాలో మట్టి కరిపించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర వహించిన సిరాజ్ ఒక ఫంక్షన్ లో తన అభిమాన క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కనబడగానే ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. పేదరికం ప్రతిభకు అడ్డు కాదని నిరూపించిన మహమ్మద్ సిరాజ్ ఈ స్థాయికి రావడానికి అతని కృషి,పట్టుదల,అంకితభావంతో కూడిన ప్రదర్శనే కారణం. విమర్శలకు కృంగిపోకుండా పొగడ్తలకు పొంగిపోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడమే సిరాజ్ ప్రస్తుతమున్న స్థితికి కారణం. వీవీఎస్ లక్ష్మణ్ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న సిరాజ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.