iDreamPost
iDreamPost
గత ఏడాది అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలై ఓటిటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సూర్య ఆకాశం నీ హద్దురా ఆస్కార్ బరిలో నిలిచింది. పరిశీలనకు అర్హత సాధించింది. గెలుస్తుందో లేదో తర్వాత విషయం కానీ కనీసం అక్కడి దాకా వెళ్లడం పట్ల మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి దీని ఒరిజినల్ వెర్షన్ సూరారై పోట్రు తమిళ భాషలో అక్కడి అకాడెమి రూమ్ లో స్క్రీనింగ్ కోసం అందుబాటులో ఉంచారు. జనరల్ క్యాటగిరీలో నటి, నటుడు, దర్శకురాలు, ఒరిజినల్ స్కోర్ తదితర విభాగాల్లో నామినేట్ చేసి ఉంచారు. సభ్యులు సినిమాను వివిధ దశల్లో చూశాక తదుపరి ప్రక్రియకు నిర్దేశిస్తారు.
ఇలా ఆస్కార్ ముంగింట్లోకి వెళ్లడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాధ్ బయోపిక్ గా రూపొందిన ఈ సినిమా డిజిటల్ వరల్డ్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. అన్ని భాషల్లోనూ అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. ప్రైమ్ ద్వారా స్ట్రీమ్ అయిన 2020 మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇప్పటికీ దీన్ని థియేటర్లో చూసి ఉంటె బాగుండేది అనుకున్న వాళ్ళు ఎందరో. అయితే ఒకదశలో దానికీ ప్రయత్నించారు కానీ ముందస్తు ఒప్పందాల వల్ల ఇటీవలే శాటిలైట్ లో కూడా ప్రసారం కావడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. లేకపోతే మంచి రెస్పాన్స్ వచ్చేది.
సుధా కొంగర దర్శకత్వంలో వహించిన ఆకాశం నీ హద్దురాకు పని చేసిన ప్రతిఒక్కరికి చాలా పేరు వచ్చింది. హీరోయిన్ అపర్ణ బాలమురళికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. విమర్శకులను సైతం మెప్పించే కంటెంట్ తో సుధా కొంగర తీర్చిదిద్దిన విధానం సినిమా స్థాయిని పెంచింది. అయితే గతంలో ఎన్నోసార్లు ఆస్కార్ గుమ్మం దాకా వెళ్లి భారతీయ చిత్రాల మాదిరి కాకుండా ఇదైనా గెలుపు గుర్రం ఎక్కుతుందేమో చూడాలి. కమల్ హాసన్, అమీర్ ఖాన్ లాంటి ఎందరో దిగ్గజాల వల్ల కానిది సూర్య వల్ల అవుతుందేమో వేచి చూడాలి. కోలీవుడ్ మాత్రం ఈ విషయంలో గట్టి ఆశలే పెట్టుకుంది