iDreamPost
iDreamPost
ఈ ఏడాది భీష్మ రూపంలో కొంత గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కు రంగ్ దే మీద చాలా ఆశలే ఉన్నాయి. లాక్ డౌన్ రాకుండా అంతా సవ్యంగా ఉంటే ఏప్రిల్ లోనే రిలీజై ఈపాటికి శాటిలైట్ ఛానల్స్ లో కూడా ఓ రెండు మూడు సార్లు టెలికాస్ట్ అయ్యేది. కానీ షూటింగ్ లో జరిగిన జాప్యంతో పాటు కరోనా ఎఫెక్ట్ టీమ్ ని బాగా ఇబ్బంది పెట్టింది. ఇటీవలే కీలకమైన దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రంగ్ దే టీమ్ విడుదల ఎప్పుడు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. అప్పుడెప్పుడో సంక్రాంతి అని టీజర్ లో చెప్పారు కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.ఇటీవలే ఒక ఆడియో సింగల్ విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ బాగుంది.
తాజా సమాచారం మేరకు రంగ్ దే కూడా రిలీజ్ విషయంలో సోలో బ్రతుకే సో బెటరూని ఫాలో అవుతోందట. అంటే థియేట్రికల్ కలిపి మొత్తం హక్కులు ఒకరికే అప్పజెప్పడం. జీ దీనికి కూడా మంచి ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. సుమారు 38 లేదా 40 కోట్ల దగ్గర ఫైనల్ కావొచ్చని వినికిడి. ఇలా చేయడం ద్వారా నిర్మాతకు టెన్షన్ తగ్గిపోతుంది. కలెక్షన్లు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు ఆడుతుందనే చింత ఉండదు. పైగా యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో ఇంత కన్నా సేఫ్ గేమ్ మరొకటి ఉండదు. పైగా సదరు సంస్థే ఓటిటి విడుదల చూసుకుంటుంది కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు.
ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత వస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన రంగ్ దే కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేశారు.ఒకవేళ బయట ప్రచారం జరుగుతున్నట్టు జనవరిలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ తాకిడి లేకపోతే థియేటర్లలోనే రంగ్ దే ని చూసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా తేడా వస్తే మాత్రం డిజిటల్ దారి పట్టక తప్పదేమో. నితిన్ దీంతో పాటు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో రూపొందుతున్న చెక్ కూడా పూర్తి చేశారు. అందాదున్ రీమేక్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. 2021లో నితిన్ స్పీడ్ గట్టిగానే ఉండబోతోంది