iDreamPost
iDreamPost
సోషల్ మీడియా ప్రభావం చాలా పెరుగుతోంది. సోషల్ మీడియా దెబ్బకు ప్రభావితం కాని వ్యక్తులు, సమూహాలు లేవనే చెప్పాలి. తాజాగా “మీడియా మొఘల్” అని చెప్పుకుంటున్న రామోజీరావు కూడా సోషల్ మీడియా తాకిడికి గురవుతున్నారు. దానికి తగ్గట్టుగా పలు మార్పులు చేసుకోవాల్సి వస్తోంది.
ఇటీవల ఈనాడు నుండి కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చ లేపింది. చాలామంది శ్రీధర్ కు అన్యాయం జరిగిందని, రామోజీరావు ఎంతోమందికి అన్యాయం చేసినట్టే శ్రీధర్ కు కూడా అన్యాయం చేశాడని, శ్రీధర్ ను చెరుకు ముక్కలా పిప్పి చేసి వదిలేశాడని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. ఇలాంటివే ఇంకా తీవ్రమైన విమర్శలు కూడా రామోజీరావు పై వచ్చాయి.
శ్రీధర్ రాజీనామా వల్ల ఈనాడుకు నష్టం రాకపోవచ్చు. అలాగే శ్రీధర్ లేకపోతే రామోజీరావుకు కూడా నష్టం రాకపోవచ్చు. ఇటువైపు శ్రీధర్ కు కూడా ఈ రాజీనామా వల్ల పెద్దగా నష్టం జరక్కపోవచ్చు. ఆయన తన వృత్తిని మరోచోట, మరో రూపంలో కొనసాగించుకోవచ్చు. కానీ ఈ వ్యవహారం సోషల్ మీడియా ఓ వివాదంగా మారింది. ఎక్కడో అన్యాయం జరిగినట్టు, దోపిడీ జరిగినట్టు సోషల్ మీడియా పోస్టులు దుమారం లేపాయి. అంతిమంగా శ్రీధర్ కు అన్యాయం జరిగిందని, రామోజీ రావు దోపిడీ చేశారని సోషల్ మీడియా ఓ నిర్ధారణకు వచ్చేసింది.
Also Read:ఈనాడుతో శ్రీధర్ అనుబంధం ముగిసింది..
శ్రీధర్ ఉద్యోగి. రామోజీరావు యజమాని. ఈ ఇద్దరి సంబంధాల్లో శ్రమ దోపిడీ ప్రస్తావన కొంత హైలైట్ అయింది. ఒక ఉద్యోగి, యజమాని మధ్య వాస్తవానికి ఇలాంటి సంబంధాలే ఉంటాయి. ఎక్కడో అరుదుగా మాత్రమే దోపిడీ ప్రస్తావన లేకుండా ఉద్యోగి సంతృప్తికరంగా కనిపిస్తారు. అయితే శ్రీధర్ – రామోజీరావు విషయంలో అత్యధికులు శ్రీధర్ శ్రమదోపిడీకి బలయ్యాడు అనో, శ్రీధర్ ను రామోజీరావు బానిసగా వాడుకున్నాడు అనో నిర్ధారణకు వచ్చేశారు. సోషల్ మీడియాలో చర్చ అంతా ఇంచుమించుగా ఈ దిశగానే సాగింది. అయితే ఈ చర్చకు శ్రీధర్ స్పందించలేదు. తాను ఈనాడుకు రాజీనామా చేశాను అని మాత్రమే ప్రకటించి ఆపైన మౌనం దాల్చారు.
సోషల్ మీడియా చర్చకు రామోజీరావు స్పందించాల్సి వచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. ఆయన సంతకంతో కూడిన ఓ లేఖ సోషల్ మీడియాలో తిరుగుతోంది. అంటే సోషల్ మీడియా చర్చకు రామోజీరావు స్పందించి జవాబిచ్చారనే అనుమానం వస్తోంది. సోషల్ మీడియా లేపిన ప్రశ్నలకు రామోజీరావు తన లేఖలో జవాబు చెప్పలేదు. కానీ సంజాయిషి ఇచ్చుకున్నట్టు కనిపిస్తోంది.
Also Read:టీడీపీ “ఆత్మగౌరవ” నినాదం – రాజీవ్ అంజయ్యను అవమానించటం ఏపిసోడ్ ఆ పత్రిక సృష్టేనా?
సోషల్ మీడియా చర్చకు పెట్టిన ఏ అంశాన్నీ రామోజీరావు ప్రస్తావించకపోయినా ఆయన రాసిన లేఖ సోషల్ మీడియా ప్రభావితం అనే అభిప్రాయం వినిపిస్తోంది. తనకు శ్రీధర్ పట్ల పుత్ర వాత్సల్యం ఉందని ప్రకటించి పరోక్షంగా తాను శ్రీధర్ కు అన్యాయం చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈనాడులో పుట్టి ఈనాడులో పెరిగిన శ్రీధర్ పట్ల తాను పుత్రవాత్సల్యం ప్రకటిస్తూ శ్రీధర్ తో తనకు ఉన్న బంధం ఉద్యోగి – యజమాని బంధం లాంటిది కాదని, తండ్రి కొడుకుల బంధం అని రామోజీరావు ప్రకటించుకుని శ్రీధర్ పెరుగుదలకు తాను ఓ యజమానిగా కంటే ఓ తండ్రిగా కృషి చేశాను అని కూడా ప్రకటించుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా పెట్టిన చర్చకు రామోజీరావు సంజాయిషీఇచ్చుకున్నట్టే కనిపిస్తోంది.
ఈనాడులో చాలామంది జర్నలిస్టులు పనిచేశారు. విశాఖలో 1974లో ప్రారంభమైన ఈనాడు ప్రస్థానం కేవలం ఒక్క యేడాదిలోనే అంటే 1975 నాటికి హైదరాబాద్ చేరుకుంది. కేవలం మూడువేల కాపీల ప్రింట్ ఆర్ధర్ తో విశాఖ తీరాన ప్రారంభం అయిన ఈనాడు ప్రస్థానం యేడాది తిరిగే నాటికి మరో ఐదువేల కాపీల ప్రింట్ ఆర్డర్ తో హుస్సేన్ సాగర్ తీరానికి చేరింది. ఆ తర్వాత అంచలంచెలుగా విస్తరించి తెలుగు పత్రికల్లో అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా అగ్రస్థానంలో నిలిచింది. ఇంచుమించు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఈ మధ్యలో ఓ దశాబ్దం పాటు ప్రత్యర్థులెవరూ సమీపంలో లేని ఏక ఛత్రాధిపత్యం చలాయించింది.
Also Read:కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేసేలా ఈనాడు యాజమాన్యం ప్రవర్తించిందా?
ఈ క్రమంలో అనేకమంది ఉద్దండులు ఈనాడు నుండి నిష్క్రమించారు. కొందరు పదవీవిరమణ చేస్తే ఇంకొందరు రాజీనామాలు చేసి ఈనాడు నుండి తప్పుకున్నారు. రాష్ట్రంలో అనేక పత్రికల ప్రారంభానికి సారధ్యం వహించిన ఏ బి కె ప్రసాద్ వంటి ఎందరో ఉద్దండులు ఈనాడు నుండి నిష్క్రమించారు.అయితే ఏ ఒక్కరి నిష్క్రమణకూ రామోజీరావు స్పందించలేదు. కేవలం శ్రీధర్ నిష్క్రమణకు, అది కూడా రెండురోజుల తర్వాత స్పందించారనే ప్రచారం ఆసక్తి రేపింది. ఇందుకు కారణం రామోజీరావు విశాల హృదయం కాకపోవచ్చని, అలాగే ఆయన చెప్పుకున్నట్టు పుత్రవాత్సల్యం కూడా కాదని. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కారణంగానే రామోజీరావు స్పందించారనేది ఎక్కువ మంది అభిప్రాయం.
Also Read:ఈనాడులో ఒకే ఒక్కడు శ్రీధర్!
రాజగురువు మొదటిసారి తనపై విమర్శలకు స్పందించడంతో లేఖ విషయమై ఐడ్రీమ్ ఆరా తీసింది. శ్రీధర్ సన్నిహితులని సంప్రదించింది. . ఈనాడులో ఓ ఉద్యోగి రాజీనామా చేస్తే ఆయనకి ఓ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు ఎవరి రాజీనామాకు ఆయన స్పందించిన దాఖలాలు లేవు. అందుకే మీడియా కంటే సోషల్ మీడియా శక్తివంతంగా తయారయిన తరుణంలో వాస్తవాలు వెలికితీసే యత్నం చేసింది.
ముఖ్యంగా రామోజీరావు పేరుతో వైరల్ అవుతున్న లేఖ పై కొందరిలో అనుమానాలు వ్యక్తం అయిన తరుణంలో వాటిని నివృత్తి చేసే యత్నం చేసింది. అయితే రామోజీరావు తన సంస్థ నుంచి రిజైన్ చేసిన శ్రీధర్ కి ఓ లేఖ రాసిన మాట వాస్తవమేనని తేలింది. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న లేఖ తో దానికి సంబంధం లేదని స్పష్టమయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఉత్తరం రామోజీ రావ్ వ్యక్తిగత లేదా ఈనాడు లెటర్ హెడ్ మీద కాకుండా వైట్ పేపర్ మీద ఉండటం కూడా ఉత్తరం నిజమా?కాదా? అన్న అనుమానం కలుగుతుంది,కానీ ఇలా తెల్ల పేపర్ మీద ఉత్తరాలు రాసే అలవాటు ఈనాడులో ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
శ్రీధర్ రిజైన్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల గురించి రామోజీరావు రాసిన లేఖ బయటపెట్టాల్సిన అవసరం లేదని శ్రీధర్ భావిస్తున్నట్టు సమాచారం. రామోజీ కి శ్రీధర్ కూడా సమాధానంగా మరో లేఖ రాశారని,ఇద్దరి మధ్య జరిగిన లేఖల గురించి అందరికీ తెలియజేయడం భావ్యం కాదని శ్రీధర్ సన్నిహితులు చెబుతున్నారు. ఏమైనా ఈ లేఖ మాత్రం చక్కర్లు కొట్టడం విశేషం