iDreamPost
iDreamPost
మాస్ మహారాజా రవితేజతో ఖిలాడీ పూర్తి చేసిన దర్శకుడు రమేష్ వర్మ కొత్త సినిమా ఇందాక ప్రకటించారు. 2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తీసిన రాక్షసుడు కు సీక్వెల్ గా టైటిల్ కి 2 నెంబర్ ని జోడించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే హీరో ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. పెద్ద స్టార్ అనే లీక్స్ వదిలారు కానీ ఇప్పటికైతే ఎలాంటి క్లూ లేదు. సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ అయ్యేదాకా తెలుగు సినిమాలు చేసే ఉద్దేశంలో లేడు కాబట్టి తను అయ్యే ఛాన్స్ లేదు. మరి ఎవరిని తీసుకోబోతున్నారో సస్పెన్స్ గా ఉంది. పోస్టర్ లో యథావిధిగా మర్డర్ మిస్టరీ అనే ఇంప్రెషన్ కలిగించడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.
రాక్షసుడు రీమేక్ సినిమా. తమిళ మూవీని మక్కికి మక్కి తీసి అదే టెంపోని మైంటైన్ చేయడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఆదరించారు. కానీ ఇప్పుడీ రెండో రాక్షసుడికి ఫ్రెష్ స్క్రిప్ట్ రాసుకున్నారు. అసలే టాలీవుడ్ లో సీక్వెల్స్ కి నెగటివ్ సెంటిమెంట్ ఉంది. బాహుబలిని మినహాయించి దాదాపు అన్ని ఫ్లాపులే. మన్మథుడు 2, కిక్ 2 , రక్త చరిత్ర 2. అవును 2, మంత్రం 2 , సర్దార్ గబ్బర్ సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది. మరి రాక్షసుడు 2 ఈ థ్రెడ్ ని బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందేమో చూడాలి. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సీక్వెల్ లో క్యాస్టింగ్ కూడా భారీగానే ఉండబోతోందట.
ఒకప్పుడు ఫ్లాపుల వల్ల గ్యాప్ తీసుకోవాల్సిన వచ్చిన రమేష్ వర్మకు బ్రేక్ ఇచ్చింది రాక్షసుడే. రవితేజ ఖిలాడీ అవకాశం ఇచ్చింది కూడా ఈ సక్సెసే. అందుకే కొనసాగింపుని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు కాబోలు. తమిళ్ లో హీరో విష్ణు విశాల్ రట్సాసన్ సీక్వెల్ ని ప్లాన్ చేసుకున్నప్పటికీ స్క్రిప్ట్ పక్కాగా కుదరకపోవడంతో పెండింగ్ లో పెట్టేశారు. ఒకవేళ ఇప్పుడీ తెలుగు వెర్షన్ సక్సెస్ అయితే అప్పుడు అక్కడ రీమేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా సైకో కిల్లర్ ల కథలు రాను రాను రొటీన్ ఫార్ములాగా మారుతున్న తరుణంలో అంత కొత్తగా రమేష్ వర్మ ఏం చూపిస్తాడో వేచి చూడాలి. ఆ బిగ్ స్టార్ ఎవరో కూడా తేలాలి మరి