iDreamPost
iDreamPost
రెండేళ్ల నుంచి ఆర్ఆర్ఆర్ తప్ప ఇంకో లోకం లేదన్నట్టు ఉంటూ వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే సస్పెన్స్ ఇంకా పూర్తి స్థాయిలో వీడలేదు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి లైన్ ఓకే చేశాడని గట్టి టాకే ఉంది కానీ అధికారికంగా ప్రకటన వచ్చే దాకా ఏదీ నమ్మలేని పరిస్థితి. అయితే దాదాపుగా ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరో తమిళ డైరెక్టర్ పేరు తెరమీదకు వచ్చింది. అతనే లోకేష్ కనగరాజ్. విజయ్ తో మాస్టర్ తీసి అంచనాలు ఆకాశం దాటించిన ఇతగాడు ఇప్పుడు కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. స్టార్లు పిలిచి మరీ కథలు చెప్పమంటున్నారట.
ప్రస్తుతం లోకేష్ కమల్ హాసన్ తో చేస్తున్న విక్రమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే వేసవిలోపు దాన్ని పూర్తి చేసేలా ప్లానింగ్ జరిగింది. కమల్ రాజకీయ ప్రచారంలో బిజీ కాబోతున్న నేపథ్యంలో చాలా తక్కువ టైంలోనే ఫినిష్ అయ్యేలా లోకేష్ అన్ని వనరులను సిద్ధం చేసుకుని మరీ రెడీ అయ్యాడట. దీని సంగతలా ఉంచితే ఇటీవలే లోకేష్, చరణ్ ల మధ్య మీటింగ్ జరిగినట్టు ఫిలిం నగర్ టాక్. ఓ స్టోరీకి సంబంధించి డిస్కషన్ జరిగిందని అన్నీ అనుకూలిస్తే ఇది కార్యరూపం దాల్చినా ఆశ్చర్యం లేదని మెగా కాంపౌండ్ టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ క్లారిటీ రావాలంటే మాత్రం చాలా టైం పడుతుంది.
వినయ విధేయ రామ డిజాస్టర్ దెబ్బకు డిఫెన్స్ లో పడ్డ చరణ్ అంత ఈజీగా ఏ కథను ఓకే చేయడం లేదు. తనకేమో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతో చేయాలని ఉంది. వాళ్లేమో ఇప్పట్లో ఫ్రీ అయ్యేలా లేరు. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రన్వీర్ కపూర్ తో చేస్తున్న అనిమల్ స్క్రిప్ట్ ని కూడా ముందు చరణ్ కే చెప్పాడట. అయితే ఇమేజ్ పరంగా ఉన్న ఇబ్బందులను పెట్టుకుని అంత వైల్డ్ సబ్జెక్టులో నటించడం కష్టమని నో చెప్పినట్టు వినికిడి. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలవుతుందో సాక్ష్యాత్తు రాజమౌళికే అంతు చిక్కడం లేదు. వచ్చే ఏడాది దసరా మిస్ అయితే మాత్రం 2022 సంక్రాంతి దాకా ఎదురు చూడక తప్పదు.