సరిగ్గా పదేళ్ల క్రితం అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా రూపొందిన వేదం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించలేదు కానీ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. దర్శకుడు క్రిష్ సామాజిక సమస్యను తీసుకుని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసిన విధానం విమర్శకులను సైతం మెప్పించింది. అందులో ముఖ్యంగా అనుష్క చేసిన వేశ్య పాత్ర ఆ టైంలో టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో ఇలాంటి రిస్క్ చేయడం ఏమిటని అన్నవాళ్ళు లేకపోలేదు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాటలో స్వీటీ ఒలికించిన వయ్యారాలు యూత్ కి మాములు కిక్ ఇవ్వలేదు. మళ్ళీ ఆ తరహా రోల్ టాలీవుడ్ లో ఏ టాప్ హీరోయిన్ చేయలేకపోయింది.
ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బాలీవుడ్ లో రూపొందబోయే ఓ రియలిస్టిక్ బయోపిక్ డ్రామాలో రకుల్ ప్రాస్టిట్యూట్ గా నటించబోతున్నట్టు ముంబై అప్ డేట్. ప్రసిద్ధి గాంచిన రెడ్ లైట్ ఏరియాలో పేరొందిన ఒక వేశ్య కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. దర్శకుడు, నిర్మాణ సంస్థ లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రకుల్ గత కొంత కాలంగా బాలీవుడ్ లో జెండా పాతేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. గత ఏడాది చేసిన మర్జవాన్ దారుణంగా బోల్తా కొట్టింది. అంతకు ముందు దే దే ప్యార్ దే హిట్టయ్యింది కానీ ఆ సబ్జెక్టు సీనియర్ హీరో చుట్టూ తిరిగే ప్రియురాలి పాత్ర కావడంతో క్రేజీ ఆఫర్లు రాలేదు.
దాని కన్నా ముందు వచ్చిన అయారి కూడా డిజాస్టరే అయ్యింది. సౌత్ లో చూసుకుంటేనేమో వరసగా దేవ్, ఎన్జికే, మన్మథుడు 2 ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ శంకర్ ఇండియన్ 2 మీదే పెట్టుకుంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా గ్లామర్ ప్రాధాన్యత కలిగిన పాత్రలే ఎక్కువగా చేసిన రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ నటన పరంగా పెద్ద ఛాలెంజ్ ఇచ్చేదే. తనకూ పెర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ స్కోప్ దక్కుతుంది. లాక్ డౌన్ అయ్యాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.