iDreamPost
iDreamPost
కరోనా వల్ల స్టార్లు ఇంకా సెట్లలోకి అడుగు పెట్టడానికి భయపడుతున్న వేళ కేవలం చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ లో పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో పెద్ద హీరోలు ఇళ్లలో నుంచి బయటికి కాలు పెట్టడం లేదు. నవంబర్ దాకా ఇలాగే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్లు తెరిచినా తెరవకపోయినా ఇంక సంబంధం లేదన్న తరహాలో అన్ని యూనిట్లు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నాయి. ఇక హీరోయిన్ల సంగతి చెప్పేదేముంది. డేట్స్ ఇవ్వండి అంటే ససేమిరా అంటున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిదీ ఒకే మాట. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ధైర్యే సాహసే లక్ష్మి అంటూ రంగంలోకి దిగేసింది.
ఇప్పటికే వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతుండగా అందులో బిజీ అయిపోయింది. ఏకధాటిగా 40 రోజుల పాటు జరిగే సింగల్ షెడ్యూల్ లో తన డేట్స్ ని పక్కాగా ప్లాన్ చేసుకుని ఇచ్చిందట. ఇది కాకుండా హిందీలో అర్జున్ కపూర్ సరసన నటిస్తున్న మూవీ షూట్లో ఈ నెల 24 నుంచి పాల్గొనబోతోంది. మెగా హీరో సినిమాకు చిన్న బ్రేక్ అన్నమాట. ఆలోగా తను లేని సీన్స్ ని తీసుకుంటాడు క్రిష్. కాషివే నాయర్ దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రానికి టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు చేయబోయే షెడ్యూల్లో 10 రోజులు వచ్చే సెప్టెంబర్ లో 10 రోజులతో పాటు మొత్తం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. దీన్ని కూడా ఓటిటికే పప్లాన్ చేస్తున్నట్టు ముంబై టాక్.
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ పాత్ర ఎలా ఉండబోతోందన్న డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి రకుల్ హైదరాబాద్-ముంబైల మధ్య ట్రిప్పులు వేస్తూ ఫుల్ బిజీ కాబోతోందన్న మాట. ఇప్పుడు రకుల్ ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకెందరు బయటికి వస్తారో చూడాలి. పూజా హెగ్డే తాను సిద్ధమన్నట్టు ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది కానీ చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులు కావడంతో హీరోలు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చే దాకా నిర్మాతలు ఏమి చేయలేని పరిస్థితి. రష్మిక మందన్న, సాయి పల్లవి, కీర్తి సురేష్ తదితరులు పాల్గొనాల్సిన చాలా సినిమాలు కీలకమైన స్టేజిలో ఉన్నాయి. దసరా గడిచే దాకా ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడమే బెటర్ గా కనిపిస్తోంది.