iDreamPost
iDreamPost
ఏడాదికి పైగా అలుపెరుగని పోరాటం.. ఎముకలు కొరికే చలి, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను లెక్కచేయని తెగువ.. రాజకీయ ఒత్తిళ్లకు, దేశద్రోహం కేసులకు తల వంచని మొండితనం.. జగమొండిలాంటి ప్రధాని మోదీ మెడనే వంచగలిగాయి.
ఏడాదికిపైగా సాగుతున్న రైతు మహా ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చాయి. రైతుల సత్యాగ్రహానికి.. అలుపెరుగని పోరాటానికి చివరికి కేంద్రం దిగిరాక తప్పలేదు. స్వయంగా మోదీయే రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంతటి మహా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఘనుడు.. మోదీని మడమ తిప్పుకునేలా చేసిన ఘనుడు మాత్రం ఒకే ఒక్కడు.. అతడే రాకేష్ తికాయత్. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భారత కిసాన్ యూనియన్ (బీకేయూ) నేతగా రైతులను ఏకతాటిపై నడిపించిన ధీరుడు.
తండ్రి బాటలో తనయుడు
మహా ఉద్యమాన్ని ఏడాదికిపైగా విజయవంతంగా నడిపించిన రాకేష్ తికాయత్ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లా సిసౌలీ గ్రామంలో జన్మించారు. మీరట్ విశ్వవిద్యాలయంలో పీజీ చేసిన ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడు కూడా. ఈయన తండ్రి జాతీయ స్థాయిలో పేరున్న రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్. భారత కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1990ల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా లక్షలాది రైతులతో ఢిల్లీని ముట్టడించిన చరిత్ర ఆయనది. 1992లో రాకేష్ ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్సైగా పని చేసేవారు. తండ్రి కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం రాకేష్ ఉద్యోగంపై ప్రభావం చూపింది. తండ్రిని ఒప్పించి ఉద్యమాన్ని ఆపించాలని ఒత్తిడి పెరగడంతో ఉద్యోగం వదిలేశారు. 1994లో బీకేయులో చేరారు.
రైతు ఉద్యమంలో అంతా తానై..
భారత కిసాన్ యూనియన్ (బీకేయూ)కు ప్రస్తుతం రాకేష్ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతుండగా.. అతని సోదరుడు నరేష్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో మూడు చట్టాలు చేసింది. ఇవి రైతుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, వ్యవసాయాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టే కుట్ర అని రైతు సంఘాలు ఆరోపించాయి. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రైతు సంఘాలు ఉద్యమబాట పట్టాయి. గత ఏడాది నవంబరులో బీకేయూ కూడా ఈ ఉద్యమంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి రాకేష్ తికాయత్ ఉద్యమానికి కళ్లు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించారు.
ఢిల్లీ శివార్లలో నెలల తరబడి మోహరించిన రైతులను ఏకతాటిపై నడిపించడంలో కృతకృత్యులయ్యారు. ఒకవైపు రైతులు చనిపోతున్నా.. ప్రభుత్వం నుంచి అణచివేత పెరుగుతున్నా.. అనేకమంది రైతులు ఉద్యమాన్ని వీడుతున్నా వెనుకంజ వేయలేదు. ఉత్తరప్రదేశ్ రైతులను కూడా భాగస్వాములను చేసి.. ఉద్యమ వేడి తగ్గకుండా చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని నడిపించారు. 2007లో కటౌలి నుంచి అసెంబ్లీకి, 2014లో అమ్రోహా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రాకేష్ తికాయత్ వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో మాత్రం విజయం సాధించారు.