iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ షాకింగ్ లవ్ స్టొరీ – Nostalgia

  • Published Feb 21, 2020 | 5:04 AM Updated Updated Feb 21, 2020 | 5:04 AM
రజినీకాంత్ షాకింగ్ లవ్ స్టొరీ – Nostalgia

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యగా లత గురించి అభిమానులకు తెలిసింది కూడా చాలా తక్కువ. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహమనే తప్ప అంతకు మించిన సమాచారం ఎక్కువగా ఎవరికి తెలియదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. చాలా ఏళ్ళ క్రితం అంటే రజిని పెళ్లి కాక మునుపు లత అనే కాలేజీ స్టూడెంట్ తమ విద్యాసంస్థ ప్రచురించే మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి అతని దగ్గరకు వచ్చింది. ఇక్కడో ట్విస్ట్ ఉంది. 

తమిళ్ తో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాల ద్వారా మనకు పరిచయమున్న వైజి మహేంద్రన్ భార్య చెల్లెలే ఈ లత. ఆ రికమండేషనే ఇక్కడ పనికొచ్చింది. సరే ఇంటర్వ్యూ ఉద్దేశం ఏదైనా లత రజని తొలిచూపులోనే ఒకరినొకరు విపరీతంగా ఇష్టపడ్డారు. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఓ రెండు రోజులు లత కనిపించలేదు. ఎక్కడికో ఊరికి వెళ్లి ఉంటుందనుకున్న రజని షూటింగ్స్ లో బిజీ అయిపోయాడు. ఇప్పట్లా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి వెంటనే సంప్రదించడానికి లేదు.

తీరా తిరిగి వచ్చిన లతను చూసి రజనీకాంత్ కు షాక్ తో నోటమాట రాలేదు. కారణం ఆవిడ తల మీద జుత్తు లేదు. గుండు చేయించుకుని వచ్చారు. అతి కష్టం మీద అలా సంభ్రమాశ్చర్యంతోనే ఏంటీ వేషమని అడిగాడు రజని. మీరంటే ప్రాణమని ఎక్కడ మీ మనసు మారుతుందోనని భయపడి అలా జరక్కుండా తిరుపతి వెళ్లి వెంకటేశ్వరస్వామికి తలనీలాలు ఇచ్చి వచ్చానని చెప్పింది. 

దీంతో కదిలిపోయిన రజని అయితే ఆ స్వామి సన్నిధిలోనే వివాహం చేసుకుందామని చెప్పి అన్నమాట ప్రకారం కొద్దిరోజుల తర్వాత  ఏడుకొండల పైనే తాళి కట్టాడట. అప్పటికి లతకు పూర్తి జుట్టు రాలేదు. ఇప్పుడు మనం చూస్తున్న బాయ్ కట్ లోనే ఉన్నారట. అలా ఈ బంధం గట్టిపడి ఇద్దరు కూతుళ్ళకు తల్లితండ్రులయ్యారు రజని లతలు. మొత్తానికి ఇలా వెంకన్న ఆశీసులతో రజని దాంపత్యం కొనసాగిందన్న మాట. ఏ మాటకామాటే. అంత యుక్త వయసులో ప్రేమించినవాడు దూరం కాకూడదనే ఉద్దేశంతో లత చేసిన సాహసం మాత్రం ఏ ఆడపిల్ల అంత సులభంగా చేసేది కాదు.