Idream media
Idream media
ఉత్కంఠభరిత సినిమాను తలపించేలా రాజస్థాన్ రాజకీయం సాగుతోంది. రోజుకో ట్విస్ట్‌తో రసవత్తరంగా సాగుతోంది. తాజాగా బీఎస్పీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరి, విలీనం ప్రకటించుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారితోపాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శిలకు కూడా నోటీసులు పంపింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంపై బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తాజా చర్యలు చేపట్టింది. ఆగస్టు 11వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
విచారణ సందర్భంగా బీఎస్పీ తరఫు న్యాయవాది.. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. జాతీయ స్థాయిలోగానీ, రాష్ట్ర స్థాయిలోగానీ ఏ పార్టీలోనూ బీఎస్పీ విలీనం కాలేదని చెప్పారు. పార్టీలు తప్పా వ్యక్తులు విలీనం అయ్యేందుకు అవకాశం లేదని వాదించారు. ఇప్పటికీ వారు బీఎస్పీకి రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. పార్టీ విప్ కూడా జారీ చేసిందని, వారు విప్ ఉల్లంఘిస్తే అనర్హత వేటుకు అర్హులవుతారని బీఎస్పీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
Read Also: అసెంబ్లీకి గవర్నర్ సై.. రాజస్థాన్ రాజకీయంలో నెక్ట్స్ ఏంటి..?
2018 శాసన సభ ఎన్నికల్లో 200 సీట్లు గల రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ తరఫున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు, పలు పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు మొత్తం 124 మందితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనం అయ్యారు. దీంతో కాంగ్రెస్ బలం 106కు పెరిగింది. 2019 అక్టోబర్‌లో మండవ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆపార్టీ బలం మొత్తం 107కు చేరుకుంది.
వచ్చే నెల 14వ తేదీన రాజస్థాన్ శాసన సభ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఎంట్రీ ఇవ్వడంతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు ఎదురవనున్నాయి. బోటాబోటి మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకువస్తున్న అశోక్ గెహ్లాత్‌కు తాజా పరిణామాలు మింగుడుపడేవి కావు. బీఎస్పీ తరఫున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకే చెందుతారని హైకోర్టు తీర్పు ఇస్తే.. అశోక్ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. ఇప్పటికే చిక్కుల్లో ఉన్న అశోక్… అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత మరిన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఆగస్టు 11వ తేదీన సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు నోటీసుల్లో పేర్కొనడంతో.. ఈ వ్యవహారంలో అప్పటి వరకూ మరోఅడుగు పడే అవకాశం లేదు.