iDreamPost
android-app
ios-app

సంక్షోభ వేళ గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ

సంక్షోభ వేళ గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ

సంక్షోభ వేళ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే గెహ్లాట్‌కు అనుకూలంగా ఓటెయ్యరాదని భారతీయ ట్రైబల్స్ పార్టీ (బిటిపి) తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విశ్వాస పరీక్షకే హాజరు కారాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బిటిపి జాతీయ అధ్యక్షుడు మహేశ్ భాయ్ వసావా లేఖ విడుదల చేశారు. విప్ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిటిపికి రాజస్థాన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.  

మరోవైపు గెహ్లాట్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశానికి 107 మంది ఎమ్మెల్యేలకు గానూ 84 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పైలట్‌తో పాటు సిఎల్‌పి సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలలో వేద్ సోలంకి, రాకేష్ పారిక్, మురారీ లాల్ మీనా, జేఆర్ ఖటన, ఇంద్రజ్ గుర్జర్, గజేంద్ర సింగ్ షెకావత్, హరీష్ మీనా, దీపేంద్ర సింగ్ షెకావత్, బన్వర్ లాల్ శర్మ, గజరాజ్ ఖాటన, వి.ఓలా, హేమరామ్ చౌదరి, పిఆర్ మీనా, రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్, ముఖేష్ భకర్, సురేష్ మోదీ, వీరేంద్ర చౌదరి, అమర్ సింగ్ జాతవ్ ఉన్నారు. అయితే, వీరేంద్ర చౌదరి మాత్రం సాయంత్రం సమయంలో రాజస్థాన్ ఇన్‌చార్జి అవినాష్ పాండేను, పార్టీ నేతలు రణదీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్‌లను కలుసుకున్నారు.

సమావేశం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ హోటల్‌కు తరలించారు. 200 మంది సభ్యులున్న రాజ్యసభ అసెంబ్లీలో మ్యాజిక్ నెంబర్ 101. తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని సచిన్ ప్రకటించిన నేపథ్యంలో గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడినట్లే లెక్క. దీనికి తోడు బిటిపి తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడంతో గెహ్లాట్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరమైనట్లైంది. కాగా, గెహ్లాట్ చెబుతున్నట్టు ఆయనకు మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేదని పైలట్ వర్గీయులు అంటున్నారు. పైలట్ బిజెపిలో చేరడం లేదని కూడా చెబుతున్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్‌పి సమావేశానంతరం విక్టరీ సంకేతాలివ్వడాన్ని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గీయులు తేలిగ్గా కొట్టిపారేశారు. గెహ్లాట్‌కు అవసరమైన సంఖ్యాబలం లేదని, మెజారిటీ నిరూపించుకోవడానికి ”పెరటి తోట” సరైన వేదిక కాదని అన్నారు. అందుకు అసెంబ్లీనే సరైన వేదికని పేర్కొన్నారు. గెహ్లాట్‌కు తగినంత సంఖ్యాబలం ఉంటే సమావేశానంతరం నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లకుండా హోటల్‌కు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు.

రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. పైలట్‌ను నచ్చచెప్పి వెనక్కి (జైపూర్) పంపేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు చిదంబరం, అహ్మద్ పటేల్, కెసి వేణుగోపాల్ తదితరులు రంగప్రవేశం చేశారు. ఎప్పటికప్పుడు పైలట్‌తో సంప్రదిస్తూ, ఏవైనా ఇబ్బందులుంటే జైపూర్‌లోనే ఉన్న పార్టీ పరిశీలకులతో మాట్లాడాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పైలట్‌తో పరిస్థితిని అడిగి తెలుసుకున్న అగ్రనేతలు.. జైపూర్ వచ్చి పరిశీలకులతో మాట్లాడాలని సూచించారు. ఇందుకు పైలట్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని వీరు చెబుతున్నారు. దీనిపై పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, పార్టీలో ఎవరు అసంతృప్తికి గురైనా, పార్టీ నేతలతో సంప్రదిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అంతా ఒక కుటుంబమని, కుటుంబంలో అసంతృప్తులు సహజమేనని అన్నారు. కుటుంబ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సద్దుకుపోతాయని చెప్పారు. సచిన్‌తో సహా పార్టీ నేతలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపున తాను ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నానని అన్నారు.

మరోవైపు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని బిజెపి డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పాలకులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి చెలరేగిన నేపథ్యంలోనే ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. పైలట్ వర్గానికి బిజెపి బయటి నుంచి మద్దతు ఇస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి.

వీటిపై పూనియా స్పందిస్తూ.. ‘‘మాకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. పరిస్థితిని బట్టి కేంద్ర నాయకత్వం సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం పట్ల ఎప్పూడూ నిర్లక్ష్యమే. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సచిన్ పైలట్ ఐదేళ్ల పాటు శ్రమించి పనిచేసినా ఆయన పట్ల ఆ పార్టీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది..’’ అని పూనియా అన్నారు. 

తాజాగా సచిన్ పైలట్ వర్గం ప్రభుత్వానికి దూరం జరగడంతో కాంగ్రెస్‌లో కలకలం రేగింది. బిజెపి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిందంటూ సిఎం గెహ్లాట్ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ పరిస్థితికి కారణమని బిజెపి చెబుతోంది.