Idream media
Idream media
సస్పెన్షన్‌లు.. సవాళ్లు, తిరుగుబాట్లు.. క్యాంప్ రాజకీయాలు, ఆగ్రహాలు.. ఆందోళలు, కేసులు.. వాదోపవాదాలు.. ఇవీ సుమారు నెల రోజులుగా రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజుకున్న వివాదాలు. రోజుకో మలుపు.. గంటకో స్టేట్మెంట్.., చిత్ర విచిత్రాలు, ప్రభుత్వం ఉంటుందా.. పడిపోతుందా.. అనే సందేహాలు, బీజేపీ కుట్ర పన్నుతుందనే ఆరోపణలు.. ఇలా ఎన్నో సన్నివేశాలు చోటుచేసుకున్న రాజస్థాన్ రాజకీయాలు ఇప్పుడు కొలిక్క వచ్చాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, తిరుగుబాటు నేత సచిన్ పైలెట్ వర్గాలు ఇప్పుడు ఐక్యతా మంత్రం పటిస్తున్నాయి. కుటుంబ పెద్దపై కొంచెం అలిగాం అంతే అని పైలెట్ వర్గం, అన్నీ మరిచిపోయి ప్రజాస్వామ్యం కోసం కలిసి ఉందామని సీఎం గెహ్లాత్ సరికొత్త స్టేట్‌మెంట్ లు ఇస్తున్నారు.
ఫలించిన ప్రియాంక మంత్రాంగం
ఈ మొత్తం ఎపిసోడ్ లో రాహుల్ గాంధీ కన్నా ప్రియాంక గాంధీయే కీలకంగా మారింది. వివాదం మొదలైన వారం రోజుల్లోనే ఆమె రంగ ప్రవేశం చేశారు. సచిన్ పైలెట్ తో సంప్రదించారు. ఆ సమయాన సచిన్ మెత్తబడినట్లే కనిపించినా మళ్లీ రాజకీయాలు మొదలెట్టారు. గెహ్లాత్ పై కత్తులు దూశారు. సరిగ్గా నెల రోజుల అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసిన సచిన్ వారితో జరిపిన మంతనాలు ఫలించాయి. ఆ చర్చల అనంతరం అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అటు సచిన్, ఇటు అశోక్ గెహ్లాత్ ఒక మెట్టు దిగి వచ్చారు.
జైసల్మెర్ హోటల్‌లో బస చేస్తున్న ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలను మర్చిపోయి.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను క్షమించి ముందుకు సాగాలని తన మద్దతుదారులను కోరారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడటమే మన ప్రథమ కర్తవ్యమని అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో చేసిన మాదిరిగానే రాజస్తాన్‌లో మన ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నించిందని, అలా జరగకుండా బీజేపీని ఐక్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు.
తిరుగుబాటుకు అదే కారణం
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసిన సచిన్ పైలెట్ తిరుగుబాటుకు గల కారణాలను వివరించినట్లు తెలిసింది. అశోక్ గెహ్లాత్ తనను పనికిమాలిన వ్యక్తి అంటూ పరుష పదజాలంతో విమర్శించారని.. ఆయన ప్రవర్తన తనను తీవ్రంగా కలిచి వేసిందని.. అందుకే తిరుగుబాటు చేశానని తెలిపారు. దీనిపై ఇరు వర్గాలతోను చర్చించిన అధిష్టానం సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే సచిన్ పైలె రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ అయి కొన్ని డిమాండ్లు వారి ముందు పెట్టారు. తాజాగా పైలెట్ మద్దతుదారు భన్వర్‌లాల్ శర్మతో కూడా సీఎం భేటీ అయ్యారు. ‘కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కుటుంబ పెద్దపై పిల్లలు అలకబూని కొద్ది రోజులు అన్నం తినకుండా మొండికేస్తారు. మేమూ అంతే. మా నాయకుడిపై అసహనంతో నెలపాటు దూరంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని వివాదాలు సమసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతుంది’అని భన్వర్‌లాల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.