iDreamPost
android-app
ios-app

కుదిరిన పదవుల పంపకం,రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కినట్లే !

  • Published Sep 01, 2021 | 5:19 AM Updated Updated Sep 01, 2021 | 5:19 AM
కుదిరిన పదవుల పంపకం,రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కినట్లే !

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడాదికిపైగా కొనసాగుతున్న సంక్షోభానికి కొద్దిరోజుల్లోనే తెరపడనుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటుతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం గత ఏడాది పతనం అంచుకు చేరింది. అప్పటినుంచి గెహ్లాత్, పైలట్ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు కేబినెట్ ప్రక్షాళన జరిపి సచిన్ పైలట్ వర్గానికి ప్రాధాన్యత కల్పించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ వ్యవహారాల ఇంఛార్జి అజయ్ మాకెన్ ధృవీకరించారు.

రెండు నెలలుగా విస్తృత చర్చలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. సీఎం పదవి ఆశించిన బలమైన నేత సచిన్ పైలట్ కు ఆ విషయంలో నిరాశ ఎదురైంది. సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. సచిన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. ఆయన వర్గానికి మంత్రివర్గంతో పాటు, రాష్ట్రస్థాయి పదవుల్లో ముందు ముందు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది.

కానీ ఆ హామీలను సీఎం గెహ్లాత్ విస్మరించారని ఆరోపిస్తూ సచిన్ పైలట్ గత ఏడాది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో బీజేపీ సచిన్ వర్గానికి గాలం వేసింది. దాంతో అప్రమత్తమైన కాంగ్రెస్ హైకమాండ్ సచిన్ ను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది. కొద్దికాలం ఓపిక పట్టాలని, ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తామని నచ్చజెప్పడంతో సచిన్ కొంత శాంతించారు. అప్పటినుంచీ సీఎం గెహ్లాత్, సచిన్ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

నలుగురు సచిన్ వర్గీయులకు చోటు

ఏడాది గడిచినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సచిన్ వర్గంలో మళ్లీ అసంతృప్తి రాజుకుంది. ఈ విషయం గ్రహించిన అధిష్టానం సంప్రదింపులు ముమ్మరం చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అజయ్ మాకెన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందాన్ని జైపూర్ కు జూలైలో పంపింది. ఇరువర్గాలతో చర్చలు జరిపిన ఆ బృందం.. తర్వాత కూడా అనేక మార్లు ఢిల్లీ కేంద్రంగా చర్చల ప్రక్రియ కొనసాగించింది. అనంతరం కేబినెట్లో సచిన్ వర్గానికి ఏ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై ఇరుపక్షాలతో చర్చించి.. రాజీ సూత్రం ఖరారు చేసే బాధ్యతను హర్యానా పీసీసీ అధ్యక్షురాలు కుమారి షెల్జా, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లకు అప్పగించింది. ఇటీవలే వారిద్దరూ జైపూర్ వెళ్లి చర్చలు జరిపిన అనంతరం రాజీ ఫార్ములా ఖరారు చేసి అధిష్టానానికి నివేదించింది. దాన్ని హైకమాండ్ ఆమోదించడంతో సంక్షోభానికి తెర పడే అవకాశం ఉంది.

రాజీ సూత్రం ప్రకారం గెహ్లాత్ కేబినెట్ ప్రక్షాళనలో సచిన్ పైలట్ తో సహా ఆయన వర్గీయులు నలుగురికి చోటు కల్పిస్తారు. ప్రస్తుతం కేబినెట్లో 21 మంది మంత్రులు ఉన్నారు. మరో తొమ్మిదిమందిని చేర్చుకునేందుకు అవకాశం ఉంది. కాగా ఈ ప్రక్షాళనలో ఇప్పుడున్న కొందరు మంత్రులను తప్పించనున్నారు. తొలగించే వారిని పార్టీ సేవలకు వినియోగిస్తామని, అందుకు వారు అంగీకరించారని పార్టీ ఇంఛార్జి అజయ్ మాకెన్ వెల్లడించారు. అయితే తొలగింపునకు గురయ్యే మంత్రులు ఎవరన్నది వెల్లడించలేదు. కేబినెట్ ప్రక్షాళన త్వరలోనే ఉంటుందన్నారు.